ఇంటిగుమ్మం దాటగానే గాలి విచిత్రమైన బరువుతో తాకింది. అది కేవలం గాలికాదు, పలకలేని మాటలతో నిండిన మూగ ఆర్తనాదం. అడుగులు ముందుకు వేయడానికి కూడా సంకోచం. ఆ ఇంట్లో ఎవరో ఉన్నారన్న అనుభూతి, కాదు ఎవరూ లేరన్న ఖాళీ మరింత స్పష్టంగా వినిపిస్తోంది. అది ఇప్పుడు ఒక ఇల్లు కాదు. అది ఒకప్పుడు జీవించిన జ్ఞాపకాల శ్మశానం.
గోడలన్నీ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. కానీ ఆ నిశ్శబ్దం ఖాళీ కాదు అది నిండుగా ఉంది. మాటలలో చెప్పలేని బాధతో, తిరిగి రాని క్షణాలతో, గుండెలో కూరుకుపోయిన అనుభూతులతో. ఎదురుగా గోడపై వేలాడుతున్న ఆ అద్దం ఒకప్పుడు అది జీవితం ప్రతిబింబాల గది. నవ్వులు, కోపాలు, ఆశలు, ఎదురు చూపులు అన్నీ దానిలో ప్రతిబింబించేవి.
ఇప్పుడు అది పగిలిన అద్దం. కానీ అది కేవలం గాజుపగుళ్లు కాదు మనసు విరిగిన శబ్దం అక్కడ నిశ్శబ్దంగా ఇంకా ప్రతిధ్వనిస్తోంది. ఆ పగుళ్లన్నీ ఒక్కొక్క కథలా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క చీలిక ఒక నిరాశ. ఒక్కొక్క విరిగినముక్క ఒకబాధ. అద్దం తనలో చూసిన ప్రతిబాధను తట్టుకోలేక, చివరకు తానే విరిగిపోయిందేమో అనిపిస్తుంది.
ఆ గోడ చెమ్మతో తడిసిపోయింది. వర్షం లేదు. పైకప్పు నుంచి నీరు కారడం లేదు. అయితే ఈ తడి ఎక్కడి నుంచి వచ్చింది? అద్దం కన్నీళ్లు కార్చిందేమో తనలో చూసిన బాధలన్నీ బయటకు పొంగి, గోడల మీద చెమ్మగా మారిపోయిందేమో. ఆ చెమ్మలో ఉష్ణత ఉంది ఇటీవలే ఏడ్చిన కన్నీటి వెచ్చదనం.
గోడల మీద కనిపిస్తున్న ఆ కాటుక మరకలు అవి కేవలం రంగు మరకలు కావు. అవి మనసు తనబాధను దాచుకునే ప్రయత్నంలో వేసుకున్న ముసుగు. కనురెప్పల చాటున దాచుకున్న కన్నీళ్లు, ఒకరోజు ఓర్పును, ఓపికను కోల్పోయి జారిపడి, బుగ్గలపై నుంచి గోడల మీదకు చేరిన నిశ్శబ్ద గుర్తులు. ప్రతి మరక ఒక కథ చెబుతోంది. ఎవరూ వినని కథ. ఎవరూ అర్థం చేసుకోని వేదన.
ఆ అద్దం ముందు ఒకప్పుడు ఎవరో నిలబడి ఉండేవారు. తమ ముఖం చూసుకునేందుకు కాదు తమ ఉనికి కోసం. “నేను ఉన్నానా?” అని తనని తాను ప్రశ్నించుకునేందుకు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం దొరకని రోజున ఆ అద్దం విరిగిపోయింది.
పగుళ్ల మధ్య కనిపిస్తున్న నీడలు అస్పష్టంగా కదులుతున్నాయి. అవి మనుషుల నీడలా అనిపిస్తాయి కానీ కాస్త దగ్గరగా చూస్తే అవి గాయాల నీడలు. మనం చూస్తున్నది మనిషిని కాదు మనిషి మిగిల్చిన బాధ. అద్దం ముందు నిలబడి చూస్తే మన ముఖం కూడా వెయ్యి ముక్కలుగా విరిగిపోతుంది. అది అద్దం తప్పు కాదు. మనలో విరిగిన మనసు బయటపడుతోంది అంతే.
ఆ గదిలో ఒకమూల చిన్నదీపం ప్రాణంపోయే ముందు చివరిశ్వాస తీసుకునే మనిషిలా కొడిగట్టుతోంది. ఆ వెలుగు స్థిరంగా లేదు అది వణుకుతోంది. ఒకమాట చెప్పాలనుకుని చెప్పలేని గొంతులా. ఆ దీపం వెలుగు గోడలపై పడుతూ ఆ పగుళ్లన్నింటినీ ఒక్కసారి వెలిగిస్తోంది, మళ్లీ చీకటిలో ముంచేస్తోంది.
అది నిశ్శబ్దకథ “ఇది ముగింపు కాదు ఇది మిగిలిపోయిన బాధ.” చివరికి ఆ దీపం ఆరిపోతుంది. ఒక్కక్షణం అన్నీ చీకటిలో కలిసిపోయాయి. ఆ చీకటి సాధారణమైనది కాదు. అది ముగింపు కాదు ముగియని కథకు ఒకతెర. ఇప్పుడు ఆ గదిలో ఏమీలేదు. శబ్దం లేదు. ప్రాణం లేదు. అలాగే ఖాళీ కూడా లేదు. మిగిలింది బరువైన అనుభూతి. ఆ అద్దం ఇంకా అక్కడే ఉంది పగుళ్లతో. ఆ గోడ ఇంకా తడిగానే ఉంది చెమ్మతో. ఆ మరకలు ఇంకా చెరగలేదు, సాక్ష్యాలుగా మిగిలాయి.
కాలం ముందుకు సాగిపోతోంది. మనుషులు మారిపోతున్నారు. జ్ఞాపకాలు మసకబారిపోతున్నాయి. కానీ కొన్నికథలు, ఎప్పటికీ ముగింపును ఇవ్వవు. ఆ పగిలిన అద్దం వెనుక ఇంకా సముద్రం ఉప్పొంగుతూనే ఉంటుంది.
ఆ సముద్రం పేరు
శోకం.
-లక్ష్మీ కందిమళ్ళ





