– పాలేరు నియోజకవర్గంలో ‘ప్రజా దర్బార్’ విజయవంతం
– రెవెన్యూ మంత్రి పొంగులేటి
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 9 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ విజయవంతం కావడమే నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రఘురామ్ రెడ్డితో కలిసి ఖమ్మంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ జూలై 12 నాటికి పూర్తి కాబోతోందని వెల్లడించారు.
14 క్లస్టర్లలో వెల్లువెత్తిన జనసందోహం.. 24వేల పై దరఖాస్తులు
నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా వర్గీకరించి గత 25 నుండి 30 రోజులుగా ప్రజల వద్దకే ప్రభుత్వం అనే నినాదంతో ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. సోమవారంతో ఆఖరి విభాగం పూర్తయిందని, ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు 25వేల మంది ప్రజలను తాను వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను కళ్లారా చూసి, చెవులారా విన్నానని పేర్కొన్నారు. ప్రజా దర్బార్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి 24వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయన్నారు. అందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 11వేలు, ఆసరా పింఛన్ల కోసం 5,200 అర్జీలు అందినట్లు వివరించారు. అలాగే గృహజ్యోతి పథకం దరఖాస్తులతోపాటు అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, తాగునీరు వంటి స్థానిక సమస్యలపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున వినతులు సమర్పించారని చెప్పారు.
సాదాబైనామాల సమస్యకు శాశ్వత పరిష్కారం
గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చే ముందు సాదాబైనామాల అప్‌లోడ్‌కు అవకాశం ఇచ్చి ఆ తర్వాత చట్టంలో చేర్చకుండా రైతులను గాలికి వదిలేసిందని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 9.26లక్షల సాదాబైనామా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి నిబంధనలను సవరించిందని తెలిపారు. గతంలో భూమి అమ్మిన వారి సమ్మతి కూడా కావాలనే నిబంధన ఉండేదని, కానీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అమ్మిన వారి సమ్మతి అవసరం లేకుండా నిబంధనలు మార్చామని చెప్పారు. ఇప్పటికే ఐదున్నర లక్షల దరఖాస్తులను గుర్తించి నోటీసులు ఇచ్చామని, మిగిలిన వాటికి మరో 15 రోజుల్లో నోటీసుల ప్రక్రియ పూర్తవుతుందని, చట్టప్రకారం 30 రోజుల నోటీసు గడువు తర్వాత అర్హులైన అన్ని సాదాబైనామాలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
డిజిటల్ సర్వే.. సాగులో ఉన్న వారికే భూమి పట్టాలు
తరతరాలుగా భూమి సాగులో ఉన్నా పట్టా పుస్తకాలు రావట్లేదని ఆవేదన చెందుతున్న రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి ఆధునిక భూ సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం (కాకరవాయి)లో ఇప్పటికే ఈ సర్వే విజయవంతంగా పూర్తయిందన్నారు. క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న వారికే పట్టా పుస్తకాలు ఇస్తూ లేని వారివి రద్దు చేసే చట్టాన్ని తెచ్చామని, ప్రజా దర్బార్‌లో వచ్చిన 4,300 భూ సమస్యల దరఖాస్తుల్లో దాదాపు 2,300 అప్లికేషన్లను ప్రత్యేక కార్యాచరణ ద్వారా త్వరలోనే పరిష్కరించబోతున్నామని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ అవసరాల కోసం కొంత భూమి సేకరిస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం నిషేధిత జాబితాలో పెట్టే పాత విధానాన్ని సవరించి పట్టా భూములను ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను దాదాపు పూర్తి చేశామన్నారు.
నిర్ణీత కాలపరిమితిలోగా గృహాలు, ఇళ్ల స్థలాల కేటాయింపు
ప్రజా దర్బార్‌లో వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి అధికారులను విభజించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కనీసం 45 రోజుల సమయం పడుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారి దరఖాస్తులను విడతలవారీగా అందజేస్తామని, అలాగే ఇళ్ల స్థలాల కోసం 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించామని, ఎక్కడైతే నివాసానికి యోగ్యమైన ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని సేకరించి కొద్ది రోజుల్లో ఇళ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రతిపక్షాల బురదజల్లే రాజకీయాలను తిప్పికొట్టిన ఓటర్లు
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు, పదేళ్లు దొర పాలన సాగించిన మాజీ మంత్రులు రాజకీయ దురుద్దేశంతో, స్వలాభం కోసం ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని, వారి మాటల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి కొట్టిపారేశారు. ప్రతిపక్షాల విమర్శల్లో ప్రజలకు ఉపయోగపడే న్యాయమైన అంశాలు ఉంటే పంతాలకు పోకుండా తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజా దర్బార్‌కు కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే కాక అన్ని పార్టీల పేదలు ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో వచ్చారని మంత్రి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు ఏవైనా సరే ఓటరు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





