ఆధ్యాత్మికత, విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట

– దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్లు
– గోదావరి పుష్కరాలకు మరో రూ.వెయ్యి కోట్లు
– బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్
– రూ.802 కోట్లతో సుందరీకరణ : డిప్యూటీ సీఎం భట్టి

మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 13 : ఆధ్యాత్మికతతోపాటు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, రాజ్ ఠాకూర్, గండ్ర సత్యనారాయణ రావు, ఎంపీ గడ్డం వంశీ కృష్ణతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మÖడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్పిరిలో నిర్వహించిన సభలో గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనుల ప్రస్తావన వచ్చిందన్నారు. ఆ సభ జరిగిన 37 రోజుల్లోనే నిధులు మంజూరు చేసి ఈరోజు భూమి పూజ నిర్వహించడం ప్రజాప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. దాదాపు రూ.70 కోట్లతో సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, సామాజిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను వివరించారు. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి, పునరుద్ధరణకు రూ.2,216 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు అవసరమైన వసతులు, ఘాట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం మరో రూ.1,000 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు.

బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్

గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల అభివృద్ధి, సుందరీకరణకు రూ.802 కోట్లు కేటాయించి పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రజల నమ్మకాలను, వారి కోరికలను దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తూ ముందుకు సాగుతోం దన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్.. వ్యవసాయానికి ప్రాణం

దీంతోపాటు ఈ ప్రాంత ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగానికి కూడా ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందులో భాగంగా గూడెంగుట్ట పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్(ఎత్తిపోతల పథకం) పనుల కోసం రూ.74 కోట్లు కేటాయించి ఈరోజు భూమి పూజ చేయడం శుభపరిణామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆధ్యాత్మికత, సాగునీటి రంగాల అభివృద్ధికి బహుముఖ వ్యూహంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. కేవలం అధికార హోదాను అనుభవించడమే కాక నిరంతరం ప్రజల కోసం సేవ చేయడమే ప్రజాప్రతినిధి బాధ్యత అని ప్రేమ్‌సాగర్ రావు నిరూపిస్తున్నారన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా ప్రేమ్‌సాగర్ రావు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పనిచేస్తున్నారని భట్టి విక్రమార్క కొనియాడారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *