కేంద్రంపై నెపం తగదు

– దేశ వ్యతిరేక శక్తులను కలవడానికే వెళ్తున్నారా?
– సీఎం రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వకుండా తిరస్కరణపై కేంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పష్టం చేశారు. దేశాన్ని, ప్రజలను ఇబ్బందిపెట్టే కొందరు వ్యక్తులను, సంస్థలను కలవడానికి వెళ్తున్నారనే సమాచారంతోనే ఈ నిర్ణయం జరిగిందన్నారు. గతంలో రేవంత్ రెడ్డి రెండుసార్లు అమెరికా వెళ్లినప్పుడు, లండన్, సింగపూర్ వెళ్లినప్పుడు ఎవరూ ఆపలేదని, అప్పుడు ఆపనివారు ఈ ఒక్కసారే ఎందుకు ఆపారో గుర్తుంచుకోవాలని అన్నారు. 2010 నుంచి 2024 వరకు గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా చంద్రబాబు నాయుడు, కేసీఆర్, మాయావతి, తరుణ్ గొగోయ్, అర్జున్ ముండా వంటి నేతల విదేశీ పర్యటనల ప్రతిపాదనల్లో పేపర్లు సరిగ్గా లేనప్పుడు, ఎవరిని కలుస్తున్నారో స్పష్టత ఇవ్వనప్పుడు వారిని ఆపారని గుర్తు చేశారు. ఇది విదేశాంగ శాఖ నియమావళి ప్రకారమే జరుగుతుందని, దేశానికి వ్యతిరేకంగా ఎవరినైనా కలుస్తున్నారా అనే అనుమానం ఉన్నప్పుడు ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుందని తెలిపారు. అందువల్ల ముఖ్యమంత్రి కేంద్రంపై నెపం వేయడం తీవ్రమైన పొరపాటు అని అన్నారు. గుజరాత్‌తో పోలుస్తూ మాట్లాడటంపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి గుజరాత్ అయినా తెలంగాణ అయినా దేశంలోని ఏ రాష్ట్రమైనా సమానమేనని, ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస’తోనే కేంద్రం ముందుకెళ్తోందని చెప్పారు. గుజరాత్‌లో పెట్రోల్ ధరలు సుమారు రూ.15లు తక్కువగా ఉన్నాయన్నారు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందిందంటే అది నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్లేనని స్పష్టం చేశారు. జాతీయ రహదారులు, వరంగల్ ఎయిర్‌పోర్టు, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీబీనగర్ ఎయిమ్స్, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. అలాగే ఇక్కడ స్పేస్ టెక్నాలజీ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల అభివృద్ధి అంతా కేంద్రం వల్లే జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. సరైన టూర్ ప్లాన్ ఇవ్వకుండా వెళ్లి ఇప్పుడు కేంద్రంపై అబద్ధాలు చెప్తూ రేవంత్ రెడ్డి ప్రజలను అగౌరవపరిచారని మండిపడ్డారు. ఆయన కలవబోయే ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు వాళ్లను కలుస్తున్నారు అనే అంశాలపై ప్రజలకు రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి, కేంద్రంపై అబద్ధాలు ప్రచారం చేస్తూ రాష్ట్రాన్ని అవమానపరిచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు, దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని రామచందర్ డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *