– ఈ కుట్రలను తక్షణమే ఆపాలి
– రాష్ట్ర జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారు
– సీఎంకు బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : రాష్ట్ర జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తోందని అసెంబ్లీలో బీఆరఎస్ ఉప నాయకుడు టి.హరీష్‌రావు ఆరోపించారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఏపీకి పూర్తి సహకారం అందిస్తున్న మీరు ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహ బుద్దితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి ఎన్‌వోసీ తెస్తున్నాం అనే సాకు చెప్పి రాష్ట్ర జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా అని నిలదీశారు. తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి, చిక్కాలపర్వి, చిక్కాలమంచి బ్రిడ్జ్-కం-బ్యారేజిలకు మీ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా అని అడిగారు. 2025 జులై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్‌వోసీ ఇవ్వడం వెనుక మతలబు ఏమిటన్నారు. ఏడాదిగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా అని నిలదీశారు. కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకం చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్‌కు రావాల్సిన ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయన్న విషయం మీకు తెలియదా.. లేక తెలిసే ఇదంతా చేస్తున్నారా అని అడిగారు. రాయచూర్ జిల్లాలో 2 టీఎంసీల నీటిని తరలించే కురిడి ఎత్తిపోతలను రూ.85 కోట్లతో కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్నంటే ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఇన్‌టేక్ నిర్మాణాలు 60 శాతం వరకు పూర్తి అయితే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదా అని హరీష్‌రావు నిలదీశారు. సీడబ్ల్యూసీ, కేఆరఎంబీ, తెలంగాణ, ఏపీల అనుమతులు లేకుండానే తుంగభద్రపై కర్ణాటక ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే దీన్ని వ్యతిరేకిస్తూ కనీసం ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదన్నారు. దీని వెనుక ఉన్న లోపాయికార ఒప్పందాలు ఏమిటని ఆయన అడిగారు. ఆర్డీఎస్‌లో కర్ణాటక వాటా 1.2 టిఎంసి మాత్రమే. కానీ సగటున 5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం రాజోలిబండ ఆనకట్టకు 100 మీటర్ల ఎగువన కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్, చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే తెలంగాణ వాటా మరింత తగ్గిపోతుందని, ఆర్డీఎస్ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఆర్డీఎస్‌కు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రారంభించిన ఆర్డీఎd ఫేజ్-2ను పడావు పెట్టిన మీరు ఇప్పుడు కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోతే ఆర్డీఎస్‌తోపాటు తుమ్మిళ్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. చివరి దశలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా నారాయణపేట, కొడంగల్‌కు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా దాన్ని పక్కనబెట్టారని ఆరోపించారు. కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీశారన్నారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ప్రభావం కేవలం తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతోపాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. ‘తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలి.. సీడబ్ల్యూసీ, కేఆరఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అభ్యంతరాలు తెలియజేయాలి.. తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలను కర్ణాటక తు.చ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలి.. అవసరమైతే సుప్రీం కోర్టులో కేసు వేయాలి.. కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసం రాష్ట్ర జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలి’ అని హరీష్‌రావు డిమాండ్ చేశారు. సమైక్య పాలనలో కృష్ణా జలాల కేటాయింపులో, వినియోగంలో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన పాలమూరు ప్రజలు తమ జల హక్కులను కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరిస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





