కాంగ్రెస్‌ అసమర్ధతకు నిదర్శనం

ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. మాజీ మంత్రి హరీష్‌ ‌రావు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్‌ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్‌ అసమర్ధతకు, చేతగాని తనానికి నిదర్శనమని, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు.  చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్‌ ‌పాలకులదేనని ధ్వజమెత్తారు.  మొన్న సుంకిశాలలో రిటైనింగ్‌ ‌వాల్‌ ‌కూలిన ఘటన, నేడు ఎస్‌ఎల్బీసీ సొరంగం కుప్ప కూలడం కాంగ్రెస్‌ ‌కమిషన్‌ ‌సర్కారు వైఫల్యానికి నిదర్శనం.

ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. గత నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతున్నదనీ గుర్తించినప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా మరికొంత మంది కార్మికులు లోపల ఉన్నట్లు తెలుస్తుంది. వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలి. డీ వాటరింగ్‌ ‌చేసి, వెంటనే విద్యుత్‌ ‌పునరుద్ధరించి, శిథిలాలను తొలగించి కార్మికులను వెంటనే బయటకు తీసుకురావాలి. నేషనల్‌ ‌డ్యామ్‌ ‌సేఫ్టీ అథారిటీ వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని హరీష్‌ ‌రావు  డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *