యూరియాపై బ్యాన్ రైతు వ్యతిరేక చర్య

– ముమ్మాటికీ ఇది రైతు హంతక ప్రభుత్వమే
– స్టాక్ ఉన్నా అమ్మకాలు నిలిపివేయడం దుర్మార్గం
– రైతులు అరిగోస పడుతుంటే వారోత్సవాలా?
– బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ ఆగ్రహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలా నిషేధం విధించిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మకాలపై నిషేధం మొదలైందని అన్నారు. యూరియా అమ్మకాలు నిలిపివేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. స్టాక్ ఉన్నా డీలర్లు, అగ్రో సెంటర్లు, సొసైటీల్లో రైతులకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తునదని ప్రశ్నించారు. యూరియా అమ్మకాలు నిలిపివేయడంతో చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రైతుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ వారి పాలిట శాపంగా మారిందన్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఇప్పుడు ఏకంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దుర్మార్గమన్నారు. ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు, మరోవైపు యూరియాపై ప్రభుత్వ అనధికారిక బ్యాన్ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాపై దృష్టి సారించడం మానేసి యూరియా వినియోగం తగ్గించాలంటూ రైతులకు చెప్పడం, డబ్బులు వెచ్చించి ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దారుణంగా విఫలమైన ప్రభుత్వ తీరు వల్ల ఒకవైపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుండటం వారిని అవమానించడమే అని ఆయన విమర్శించారు. రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్.. బోనస్ చెల్లించడంలో ఫెయిల్.. పంట బీమా పథకం అమలులో ఫెయిల్.. రుణ మాఫీలో ఫెయిల్.. యూరియా సరఫరాలో ఫెయిల్.. పంట కొనుగోళ్లలో ఫెయిల్.. కొన్న పంటకు బోనస్ పైసలు ఇవ్వడంలో ఫెయిల్ అని అన్నారు. ఈ వైఫ్యల్యాలను కవర్ చేసుకోవడానికి వారోత్సవాల పేరిట డ్రామా చేసినంత మాత్రాన రైతుల ఉసురు రేవంత్ రెడ్డికి తగలకుండా పోదని అన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. రైతుల నిలదీతకు భ‌యపడి అధికారులు రైతు వేదికల నుంచి పారిపోయే పరిస్థితి రావడం మీ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వలే నిరంతరం యూరియా అమ్మకాలు కొనసాగించాలని, అనధికారిక బ్యాన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *