అదానిపై అవినీతి కేసును అమెరికా ఎందుకు డిస్మిస్ చేసింది?

“అమెరికాలో తమపై నమోదైన కేసు కొట్టి వేసేందుకే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని అదాని ఎరగా వేశాడని జడ్జికి అనుమానం వచ్చింది. ఇండియాలో లంచం ఇచ్చినట్లే అమెరికాలో పెట్టుబడులను ఉద్యోగాలను ఎరగా వేశాడన్నది జడ్జి అనుమానం. చిత్రం ఏమిటంటే బ్రూక్లిన్ జడ్జి అనుమానం నిజమే అని అదాని ఆయన ముందు అంగీకరించాడు. తన తరపున వాదించిన న్యాయవాదుల బృందం, తమ పైన మోపబడిన అభియోగాలను పరిష్కరించే నిమిత్తంలో భాగంగానే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అమెరికాలో పెట్టేందుకు ప్రాసిక్యూటర్లతో బేరసారాలు చేశారని అదాని అంగీకరించాడు (ద వైర్, జులై 15, 2026)”

ఎన్వీయస్, 13-08-2026 02:28 ఏఎం
అనతి కాలంలోనే ఆసియాలో అత్యున్నత ధనికుల్లో ఒకరుగా పేరు సంపాదించిన గౌతమ్ అదాని, అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మోపిన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ఫెడరల్ జడ్జి తీర్పు ప్రకటించటం ఒక సంచలన విషయంగా మారింది. విచారణ జరిపి తగిన సాక్షాధారాలు లేకనో లేదా అవినీతికి పాల్పడలేదని గౌతమ్ అదాని లాయర్లు విజయవంతంగా నిరూపించటం వల్లనో కాకుండా ఇతర కారణాల వలన ఆరోపణలను డిస్మిస్ చేస్తున్నట్లు ఫెడరల్ జడ్జి చెప్పటమే సంచలనానికి కారణం. గౌతమ్ అదాని, సాగర్ అదాని, మరో ఆరుగురు ఇతర కంపెనీ అధికారుల పైన కేసులనుఒక రహస్య ఒప్పందం కుదిరిన దరిమిలానే రద్దు చేశారా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. గౌతమ్ అదానికి, అమెరికా ప్రభుత్వంలోని పెద్ద మనుషులకు జరిగిన లోపాయకారి ఒప్పందం ఫలితంగానే అదాని ప్రభృతులపైన నమోదైన కేసును వెనక్కి తీసుకున్నారన్న అనుమానం న్యూయార్క్, బ్రూక్లిన్ లోని ఫెడరల్ జడ్జి నికోలస్ గరాఫిస్ స్వయంగా వ్యక్తం చేయటం గమనార్హం.

అమెరికాకు చెందిన ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, గౌతమ్ అదాని, ఆయన మేనల్లుడు సాగర్ అదానిలతో పాటు మరో ఆరుగురు భారతీయుల పైన నవంబర్ 2024 నెలలో అవినీతి నేరారోపణలు చేస్తూ కేసు నమోదు అయింది. బ్రూక్లిన్ జడ్జి నికోలస్ గరాఫిస్ ప్రకారం అమెరికా న్యాయశాఖ అదాని ప్రభృతుల పైన నమోదయిన ఫ్రాడ్ మరియు బ్రైబరీ అభియోగాలను రద్దు చేసుకోవటం కోసం అనుసరించిన ప్రక్రియలో “పరిగణించదగిన అక్రమాలు” జరిగాయి. అంటే నేరం జరగకుండానే అభియోగాలు నమోదు చేసి ఉంటే వాటిని వెనక్కి తీసుకోవటానికి కూడా ఒక చట్టబద్ధ ప్రక్రియ అనుసరించాల్సి ఉంటుంది. అవేవీ అనుసరించకుండా హడావుడిగా పని కానిచ్చేశారని బ్రూక్లిన్ జడ్జి అనుమానించాడు.

గౌతమ్ అదాని, సాగర్ అదాని మరో 6 గురు ఇతరులు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు మేపటం ద్వారా భారతదేశంలో విద్యుత్ పంపిణీ కాంట్రాక్టు సంపాదించారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. ఐతే ఈ కాంట్రాక్టు కోసం అదానికి చెందిన అదాని గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల నుండి, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుండి బిలియన్ డాలర్ల డబ్బు రుణంగా తీసుకుంది. అమెరికాకు చెందిన ద్రవ్య సంస్థల నుండి రుణం తీసుకునేటప్పుడు తాను భారత అధికారులకు లంచాలు మేపి కాంట్రాక్టు కొట్టేసిన సంగతిని అదాని వెల్లడించలేదట! అక్రమంగా కాంట్రాక్ట్ సంపాదించిన సంగతి దాచి పెట్టి, అంటే అబద్ధాలు చెప్పి అమెరికా ద్రవ్య కంపెనీల నుండి, అంతర్జాతీయ ద్రవ్య కంపెనీల నుండి రుణం పొందటం అమెరికా చట్టాల ప్రకారం నేరం అవుతుంది. అందుకే అమెరికా న్యాయశాఖ అదాని తదితరుల పైన కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టింది.

ఇండియాలో అదానికి చెందిన విద్యుత్ కంపెనీ పేరు -అదాని గ్రీన్ ఎనర్జీ. ఈ కంపెనీ అమెరికాకు చెందిన విద్యుత్ కంపెనీ ‘అజూర్ పవర్’ తో జత కట్టింది. అజూర్ పవర్ కంపెనీ కి చెందిన ఫైనాన్షియల్ సెక్యూరిటీలు న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజీలో ట్రేడ్ అవుతాయి. ఈ కంపెనీ ఇండియాలో 8 గిగా వాట్లు, 4 గిగా వాట్లు మేర సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు సంపాదించింది. భారత ప్రభుత్వ కంపెనీ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఇ.సి.ఐ) 8 మరియు 4 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసి ఇవ్వాలని అజూర్ ఎనర్జీ కంపెనీకి సోలార్ ఎనర్జీ టెండర్ ని ఇచ్చింది. ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వ సంస్థ ఎస్ఇసిఐ, అజూర్ ఎనర్జీ మరియు అదాని గ్రీన్ ఎనర్జీలతో కూడిన సంయుక్త కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకునే ముందు అది సరఫరా చేసే విద్యుత్ ను ఏయే రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కమ్ లు) కొనుగోలు చేస్తాయో తెలుసుకోవాలి.

“గౌతమ్ అదాని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి మిత్రుడు అన్న సంగతి తెలిసిన విషయమే. మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడక ముందు గౌతమ్ అదాని కేవలం గుజరాత్ రాష్ట్రం వరకే పరిమితమైన పారిశ్రామికవేత్త. బిజెపి ప్రభుత్వం వచ్చాక నాలుగైదేళ్ల లోనే అదాని పారిశ్రామిక సామ్రాజ్యం అనేక రెట్లు పెరిగిపోయి ఆసియాలోనే అతి పెద్ద ధనికుల్లో ఒకరుగా అవతరించే స్థాయికి ఎదిగాడు. ఆయన ఎదుగుదల వెనుక ఎవరి అండదండలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు..”
అదాని-అజూర్ కంపెనీ సరఫరా చేసే సోలార్ ఎనర్జీ ధర చాలా ఎక్కువ. అందువలన వాటి విద్యుత్ ని కొనుగోలు చేసేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ముందుకు రాలేదు. ఇక్కడే అవినీతి వ్యవహారం నడిచిందని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2020-2024 సంవత్సరాల మధ్య కాలంలో దాదాపు 250 మిలియన్ డాలర్ల మొత్తాన్ని భారత అధికారులకు లంచంగా సమర్పించి వివిధ రాష్ట్రాలకు చెందిన డిస్కమ్ లను అదాని-అజూర్ కంపెనీ సరఫరా చేసే విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పించారని అమెరికా ఆరోపించింది. ఇండియాలో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ కొనుగోలు నిలిపివేసి, పాక్షికంగానైనా ప్రైవేటు విద్యుత్ కంపెనీ అయిన అదాని-అజూర్ కంపెనీ అధిక ధరలకు సరఫరా చేసే విద్యుత్ ను కొనుగోలు చేయటానికి 2 వేల కోట్ల రూపాయల లంచం మేపటం ద్వారా రాష్ట్రాల డిస్కమ్ లను ఒప్పించారని అమెరికా ఆరోపించింది.

ఆంధ్ర ప్రదేశ్ కనెక్షన్
తెలుగువాళ్ళకు గుండె పగిలే వార్త ఇది. ఎస్ఇసిఐ ద్వారా అదాని-అజూర్ కంపెనీ ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్ కు అతి పెద్ద కొనుగోలుదారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వచ్చింది. అంటే అమెరికా చెబుతున్న లంచాల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారన్నది అనుమానం. డిసెంబర్ 2021లో ఎస్ఇసిఐ నుండి 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా కోర్టుల్లో నవంబర్ 2024 లో నమోదైన కేసు ఫైళ్ల ప్రకారం రు 1,750 కోట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక అత్యున్నత అధికారికి లంచంగా సమర్పించారట! 2021 సంవత్సరంలో గౌతమ్ అదాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారిని పలుమార్లు కలిశాడని అమెరికా కోర్టుపత్రాలు చెబుతున్నాయి. లంచం చెల్లించి విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఖాయం చేసుకునేందుకే గౌతమ్ అదాని పలుమార్లు ఆంధ్ర అధికారులను కలిశాడని అమెరికా ఆరోపించింది.

అలాగే ఆగస్టు 2021లో ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా కలిశాడని అమెరికా కోర్టుపత్రాలు తెలియజేస్తున్నాయి. అప్పట్లో అంటే నవంబర్ 2024 ప్రాంతంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో సహా పలు పత్రికలు ఈ సంగతిని తెలియజేస్తూ వార్తలు ప్రచురించాయి కూడా. జగన్ తో జరిగిన సమావేశంలోనే తమ కంపెనీ నుండి ఆంధ్రప్రదేశ్ డిస్కమ్ లూ 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులకు లంచం చెల్లించటం గాని లేదా లంచం చెల్లిస్తానని వాగ్దానం చెయ్యటం గాని జరిగిందని అమెరికాకు చెందిన సెక్యూరిటీ అండ్ ఎక్చేంజీ కమిషన్ ఆరోపించింది. అమెరికా ప్రాసిక్యూటర్ల ప్రకారం లంచాలు మేపటం ద్వారా సంపాదించిన కాంట్రాక్ట్ వలన 20 సంవత్సరాల కాలంలో పన్నులు చెల్లింపు అనంతర లాభాలు దాదాపు 2 బిలియన్ డాలర్లు ఉంటాయని అంచనా. విదేశాల్లో ఐనా సరే లంచాలు మేపటం ద్వారా సంపాదించిన కాంట్రాక్టుల కోసం అమెరికా ద్రవ్య కంపెనీల నుండి రుణం సేకరించటం నేరం. ఆ మేరకు అమెరికా చట్టాలు చేసుకుంది.

ఈ చట్టాల ద్వారా గౌతమ్ అదాని, సాగర్ అదాని లతో పాటు వినీత్ జైన్ లాంటి మరో 6 గురి పైన అమెరికా ప్రాసిక్యూటర్లు కేసు నమోదు చేశారు. లంచాలు చెల్లించిన సంగతి దాచి అమెరికా ఫైనాన్స్ కంపెనీల నుండి రుణం సేకరించారు గనుక, అమెరికాలో అది నేరం గనుక నేరాభియోగాలు నమోదు చేశారు. దాదాపు 2 బిలియన్ డాలర్లకు పైగా రుణాలను అదాని ఈ విధంగా సేకరించాడని, మరో 1 బిలియన్ డాలర్లు బాండ్ల అమ్మకం ద్వారా అమెరికాలోని మదుపుదారుల నుండి సేకరించాడని అభియోగాలు మోపారు. అమెరికాలో ఈ చట్టం పేరు ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్.సి.పి.ఏ – విదేశీ అవినీతి చర్యల చట్టం). ఈ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించి అదాని ప్రభృతులపై నేరాభియోగం చేశారు. ఈ నేరాన్ని విచారించకుండా ఆటంకపరిచారని చెబుతూ వీరిలోనే నలుగురి పైన మరో నేరాన్ని కూడా మోపారు.

ఐతే అదాని మొదలైన వారిపైన నమోదు చేసిన కేసులను రద్దు చేసేందుకు అమెరికా ప్రాసిక్యూటర్లు ఎట్టకేలకు నిర్ణయించుకున్నారు. అదాని తదితరుల పైన కేసులు కొట్టేయటంలో మతలబు జరిగిందని బ్రూక్లిన్ జడ్జి నికోలస్ కి అనుమానం వచ్చింది. కేసు విచారణకు వెళ్ళేందుకు ముందే కొట్టివేసేందుకు ఒక క్రమపద్ధతి అనుసరించాల్సి ఉండగా అలా జరగకుండానే కేసు కొట్టేయటంతో ఆయనకి అనుమానం వచ్చింది. సరిగ్గా కేసు కొట్టివేయటానికి ముందు రోజుల్లోనే (నవంబర్ 2024) అమెరికాలో విద్యుత్ మరియు మౌలిక నిర్మాణాల రంగంలో 10 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు పెడతానని గౌతమ్ అదాని డొనాల్డ్ ట్రంప్ కు ప్రమాణం చేసి చెప్పాడు. ఈ పెట్టుబడుల ద్వారా అమెరికాలో 15,000 ఉద్యోగాలు కల్పిస్తానని కూడా అదాని వాగ్దానం చేశాడు. రెండోసారి అధ్యక్షుడుగా గెలిచినందుకు ట్రంప్ ని అభినందించటానికి కలిసిన అదాని పనిలో పనిగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి, ఉపాధి కల్పన లాంటి వాగ్దానాలు కూడా చేశాడు.

అమెరికాలో తమపై నమోదైన కేసు కొట్టి వేసేందుకే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని అదాని ఎరగా వేశాడని జడ్జికి అనుమానం వచ్చింది. ఇండియాలో లంచం ఇచ్చినట్లే అమెరికాలో పెట్టుబడులను ఉద్యోగాలను ఎరగా వేశాడన్నది జడ్జి అనుమానం. చిత్రం ఏమిటంటే బ్రూక్లిన్ జడ్జి అనుమానం నిజమే అని అదాని ఆయన ముందు అంగీకరించాడు. తన తరపున వాదించిన న్యాయవాదుల బృందం, తమ పైన మోపబడిన అభియోగాలను పరిష్కరించే నిమిత్తంలో భాగంగానే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అమెరికాలో పెట్టేందుకు ప్రాసిక్యూటర్లతో బేరసారాలు చేశారని అదాని అంగీకరించాడు (ద వైర్, జులై 15, 2026) ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమెరికాలో నేరస్థులు, ప్రాసిక్యూటర్లతో (న్యాయశాఖతో) ప్లీ డీల్ కుదుర్చుకోవటం సర్వసాధారణం.

హత్యలు లాంటి నేరాలు కాకుండా డ్రగ్స్ రవాణా, ఆర్ధిక నేరాలు లాంటి నేరాలకు పాల్పడిన వాళ్ళు ప్రాసిక్యూటర్లతో వివిధ రకాల ఒప్పందాలు చేసుకుని శిక్ష తగ్గించుకోవటం లేదా శిక్ష లేకుండా బయటపడటం మామూలు విషయం. అది చట్టబద్ధమైన వ్యవహారమే. తమ పైన కేసును పరిష్కరించుకోవటానికి వీలుగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి అమెరికాలో పెట్టేందుకు అంగీకరించానని అదాని చెప్పినప్పటికీ అమెరికా ప్రాసిక్యూటర్లు అలాంటి ఒప్పందం వల్లనే కేసు కొట్టివేయటం జరగలేదని చెప్పారు. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతానని అదాని చేసిన ఒప్పందం తమ కేసుపైన ఎలాంటి ప్రభావం చూపలేదని జడ్జికి చెప్పారు (ద వైర్ పత్రిక, 15 జులై 2026). దానితో జస్టిస్ గరాఫిస్ కేసును ఉపసంహరించుకుంటామన్న ప్రాసిక్యూటర్ల నిర్ణయాన్ని ఆమోదించాడు. ప్రాసిక్యూటర్ల అభ్యర్ధన మేరకు కేసు కొట్టివేస్తూ జడ్జి ఈ నిర్ణయం తనది కాదని స్పష్టం చేశాడు.

ఎస్ఇసి ఆదేశాల మేరకు మరో సెటిల్‌మెంట్ ఒప్పందాన్ని అదాని కుదుర్చుకోవలసి వచ్చింది. ఇరాన్ పైన విధించిన ఆంక్షలను ఉల్లంఘినందుకు గాను అమెరికా ట్రెజరీ కి 275 మిలియన్ డాలర్లు చెల్లించాలి. అలాగే అమెరికా సెక్యూరిటీ ఎక్చేంజీ కమిషన్ కి సివిల్ పెనాల్టీ అగ్రిమెంట్ కింద మరో మొత్తాన్ని చెల్లించాలి. ఎస్ఇసి కి ఎంత చెల్లించాలో వివరాలు అందుబాటులో లేవు (ఆల్ జజీరా, 18 మే 2026). ఆ విధంగా అమెరికాలో 10 బిలియన్ డాలర్ల మేరకు ఎనర్జీ మరియు ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి 15 వేల ఉద్యోగాలు కల్పిస్తానని ఒప్పందం కుదుర్చుకుని తనపైన నమోదైన అవినీతి అభియోగాల నుండి గౌతమ్ అదాని, సాగర్ అదాని, వినీత్ జైన్ తదితరులు బైట పడ్డారు. ఈ సంగతి ఆల్ జజీరా, రాయిటర్స్ లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు ధృవీకరించాయి.

అమెరికాలో పెట్టుబడులు పెడతానని, వేలాది ఉద్యోగాలు కల్పిస్తానని వాగ్దానం చేయటం ద్వారా, అసలు ఈ కేసుతో సంబంధం లేని ఇరాన్ ఆంక్షల వ్యవహారం అడ్డం పెట్టుకుని 275 మిలియన్ డాలర్ల పెనాల్టీ చెల్లించటం ద్వారా అమెరికాలో నమోదైన కేసుల నుండి బైట పడాల్సిన అవసరం గౌతమ్ అదానికి ఎందుకు కలిగినట్లు? ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి, అనగా భారత ప్రజలకు ఉన్నది. అమెరికా న్యాయశాఖతో ఒప్పందం చేసుకుని అవినీతి అభియోగాల నుండి అదాని బైట పడ్డారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారికి 1750 కోట్ల రూపాయలు లంచం చెల్లించినట్లు ఆయన అంగీకరించినట్లే అని భావించవచ్చా. ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టాలంటే భారతదేశంలో గౌతమ్ అదాని పైన అవినీతి కేసు పెట్టాల్సి ఉంటుంది. అసలు ఈ ప్రశ్నతో సంబంధం లేకుండానే అదాని పైన కేసు నమోదు చేయాలి. కానీ భారత ప్రభుత్వం నుండి ఇంతవరకు ఎలాంటి చర్య గానీ, ప్రకటన గానీ లేదు. గౌతమ్ అదాని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి మిత్రుడు అన్న సంగతి తెలిసిన విషయమే.

మోడి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడక ముందు గౌతమ్ అదాని కేవలం గుజరాత్ రాష్ట్రం వరకే పరిమితమైన పారిశ్రామికవేత్త. బిజెపి ప్రభుత్వం వచ్చాక నాలుగైదేళ్ల లోనే అదాని పారిశ్రామిక సామ్రాజ్యం అనేక రెట్లు పెరిగిపోయి ఆసియాలోనే అతి పెద్ద ధనికుల్లో ఒకరుగా అవతరించే స్థాయికి ఎదిగాడు. ఆయన ఎదుగుదల వెనుక ఎవరి అండదండలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అదాని-అజూర్ కంపెనీ నుండి సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కడప, అనంతపురం తదితర జిల్లాల్లో ప్రజలకు అధిక ధరలతో కూడిన సోలార్ విద్యుత్ ను అంటగడుతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో పాలకులను దేవుళ్ల తరహాలో పూజిస్తూ వారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గుడ్డిగా ఆమోదిస్తున్న ప్రజలు కళ్లు తెరవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *