మిల్లర్ల సమస్యలకు సానుకూల పరిష్కారం

– మంత్రివర్గ ఉప సంఘంతో రైస్ మిల్లర్ల ప్రతినిధుల భేటీ
– రైతుల ప్రయోజనాలు-ప్రజాధన పరిరక్షణతో మిల్లింగ్ రంగానికి భరోసా
– మిల్లర్లను ప్రత్యర్థులుగా కాదు.. భాగస్వాములుగా చూస్తాం
– పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : రైస్ మిల్లర్లు సమ్మెకు దిగిన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితికి సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రివర్గ ఉప సంఘం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పరస్పర విశ్వాసం, సహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల్లో మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సావధానంగా విని నిబంధనల పరిధిలో సానుకూల పరిష్కారం చూపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. నీటిపారుదల, పౌర సరఫరాల శాUల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమలు-ఐటీ శాU మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్, అదనపు డైరెక్టర్ రోహిత్ పాల్గొన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున తూడి దేవేందర్ రెడ్డి, గంప నాగేందర్, మోహన్ రెడ్డి, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెనాల్టీలు, టెండర్ ధాన్యం ధరలు, స్టాక్ వ్యత్యాసాలు, సరఫరా గడువు పొడిగింపు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందులను మిల్లర్ల ప్రతినిధులు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారు. వారి అభ్యంతరాలు, ఆందోళనలను మంత్రులు ఓపికగా విని అంశాలవారీగా అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మిల్లర్లను ప్రభుత్వం ప్రత్యర్థులుగా కాక ధాన్యం కొనుగోలు-మిల్లింగ్ వ్యవస్థలో కీలక భాగస్వాములుగా చూస్తోందని స్పష్టం చేశారు. ఈ అంశానికి రాజకీయాలతో సంబంధం లేదని, రైతులు, ప్రభుత్వం, మిల్లర్లు ఒకే వ్యవస్థలో భాగస్వాములనే భావనతో సమస్యను పరిష్కరించాలని సూచించారు. మిల్లర్ల వినతులను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తాం.. ప్రభుత్వ పరిధిలో ఏమి చేయగలమో అన్ని కోణాల్లో ఆలోచిస్తాం.. మిల్లర్లపై అనవసరమైన భారం మోపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు.. అదే సమయంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసిన వాస్తవ వ్యయాన్ని, ప్రజాధనాన్ని విస్మరించలేం అని మంత్రి పేర్కొన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటోందని, ఆ నిధులతో రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తున్నామని వివరించారు. రైతులకు చెల్లించిన కనీస మద్దతు ధరతోపాటు బ్యాంకులకు చెల్లిస్తున్న వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. టెండర్ ధాన్యం ధర రెండు నెలల క్రితం నిర్ణయించినది కావచ్చు.. కానీ ఆ తర్వాత కూడా పౌర సరఫరాల సంస్థ బ్యాంకులకు నిరంతరంగా వడ్డీ చెల్లిస్తూనే ఉంది.. రైతులకు చెల్లించిన మద్దతు ధర, దానిపై ప్రభుత్వం భరించిన వడ్డీ కంటే తక్కువ ధరను నిర్ణయించడం సాధ్యం కాదు.. ప్రభుత్వం ఖర్చు చేసిన వాస్తవ మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవడమే తమ ఉద్దేశం.. అంతకు మించి మిల్లర్లపై భారం వేయాలన్న ఆలోచన లేదు అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మిల్లర్లు ప్రస్తావిస్తున్న పెనాల్టీలను గత ప్రభుత్వం విధించిందని మంత్రి గుర్తు చేశారు. అయితే అవి గత ప్రభుత్వ నిర్ణయాలంటూ సమస్యను పక్కన పెట్టబోమని, మిల్లర్ల ప్రస్తుత ఇబ్బందులను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు. ఏడాది, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సరఫరాల కారణంగా పౌర సరఫరాల సంస్థపై వడ్డీ భారం పెరిగిన విషయాన్ని కూడా మిల్లర్లు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య ఎవరికీ వ్యక్తిగత ప్రయోజనాలు లేవని, రైతుల సంక్షేమం, ప్రజాధన పరిరక్షణ, మిల్లింగ్ రంగం స్థిరత్వం అనే మూడు లక్ష్యాల మధ్య సమతుల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ముందుకొస్తున్నందున మిల్లర్లు సమ్మెను విరమించి నాలుగైదు రోజుల సమయం ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ వ్యవధిలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు మిల్లర్ల వినతులను, ప్రభుత్వ వాస్తవ వ్యయాన్ని, నిబంధనల పరిధిలో అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అధికారుల స్థాయిలో ప్రాథమిక కసరత్తు పూర్తయిన తరువాత మిల్లర్ల ప్రతినిధులతో మరోసారి సమావేశమై తుది నిర్ణయానికి రావాలని సమావేశంలో నిర్ణయించారు. సమస్యను సాగదీయకుండా, ఏకపక్ష నిర్ణయాలకు తావివ్వకుండా, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించాలన్న సంకల్పాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *