తొలిసారి లోక్‌సభలో అడుగు పెడుతున్న చెల్లి
అన్న రాహుల్ మెజార్టీని దాటేసి రికార్డ్ మెజార్టీ
హర్షం వ్యక్తం చేసిన సిఎం రేవంత్
వయనాడ్, నవంబర్ 23: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలి అడుగులోనే విజయఢంకా మోగించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థిపై 3.94లక్షలకు పైగా వోట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో అన్నా చెల్లెళ్లిద్దరూ లోక్‌సభ సభ్యులయ్యారు. తల్లి సోనియా ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల వోట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు.
వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల వోట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయ్‌బరేలీలోనూ విజయం సాధించడంతో ఆ తర్వాత ఈ స్థానాన్ని వొదులుకున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ప్రియాంక రంగంలోకి దిగారు. జార?ండ్ తొలి విడత ఎన్నికలతో పాటుగా నవంబర్ 13న ఈ స్థానంలో పోలింగ్ జరిగింది.
వయనాడ్ ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రియాంక గాంధీ రికార్డు మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ పేరిట నమోదైన మెజారిటీ రికార్డును ప్రియాంక బద్ధలు కొట్టారు. శనివారం మధ్యాహ్నం వయనాడ్‌లో ప్రియాంక గాంధీ మెజారిటీ 3 లక్షల 77 వేల 517 వోట్లు దాటింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీకి వయనాడ్‌లో 3,64,422 వోట్ల మెజారిటీ దక్కింది. ఈ రికార్డును బద్ధలు కొట్టి అన్న మెజారిటీ రికార్డును తిరగరాసిన చెల్లిగా ప్రియాంక గాంధీ నిలిచింది.
అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి వయనాడ్‌లో ప్రియాంక గాంధీకి 4 లక్షల మెజారిటీ దక్కొచ్చనే అంచనాలున్నాయి. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ప్రజలు రికార్డు స్థాయిలో విజయాన్ని అందిస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈమేరకు శనివారం రేవంత్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వయనాడ్ ప్రజలు ఆమెకు రికార్డు స్థాయి విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఘన విజయంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారని హర్షాన్ని వ్యక్తం చేశారు.