సామాన్య ప్రజలు అన్ని విధాలా లబ్ది పొందాలి
ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
భద్రాచలం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి
భద్రాచలం,ప్రజాతంత్ర,నవంబర్ 23 : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలయ్యే విధంగా జిల్లా అధికారులు కృషి చేస్తే సామాన్య ప్రజలు అన్ని విధాలా లబ్ధి పొందుతారని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్ లో భద్రాచలం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని వివిధ శాఖల శాఖల అధికారులతో శాఖల ఏజెన్సీ మండలాలలోని సమస్యల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వ ఆలోచనను ఆచరణలో పెట్టి గిరిజన కుటుంబాలకు, గిరిజన రైతులకు, గిరిజన గ్రామాలలోని మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. గిరిజన గ్రామాలలో బీటీ రోడ్లు, చెక్ డ్యాములు, కరెంట్ స్తంభాలు, గిరిజన రైతులకు త్రీఫేస్ లైను, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా సరఫరా చేసే మంచినీటి విషయంలో కానీ, ఆరోగ్య శాఖ ద్వారా బీద ప్రజానీకానికి అందించే సేవలు విషయంలో గానీ ఎటువంటి లోటుపాట్లు కలగకూడదని అన్నారు.
పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మాణం చేపట్టే బిటి రోడ్లు నియోజకవర్గంలో త్వరగా పూర్తయ్యేలా చూడాలని, ప్రోగ్రెస్ లో ఉన్నవి వెంటనే పనులు ప్రారంభించాలని, భద్రాచలంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం పూర్తి అయినందున వాటికి సంబంధించిన మిషనరీ అమర్చి 15 రోజులలో ప్రారంభించాలని, అలాగే మారుమూల గిరిజన గ్రామాలలో ఐటిడిఏ ఇంజనీరింగ్ ద్వారా చేపట్టిన రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని, ఫారెస్ట్ వారి అనుమతులు ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్ పిఓ ద్వారా సంబంధిత ఫారెస్ట్ అధికారులను సంప్రదించి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొని ఒక వారంలో పనులు అయ్యేలా చూడాలని, అలాగే గిరిజన గ్రామాలలో గిరిజన విద్యార్థిని, విద్యార్థుల కోసం నడిపిస్తున్న జిపిఎస్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, జిపి బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్, బీటీ రోడ్స్ పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ లక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇవ్వాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా త్రీఫేస్ లైను తప్పనిసరిగా ఏర్పాట్లు చేసి నిరంతరంగా విద్యుత్ ప్రసరించేలా చూడాలని, ఫారెస్ట్ వారి అబ్జెక్షన్తో ఆగిన త్రీఫేస్ లైను వారిని సంప్రదించి క్లియరెన్స్ తెచ్చుకొని కరెంట్ పోల్స్ అమర్చాలని, లో వోల్టేజి సమస్య ఉన్న గ్రామాలలో అవసరమైతే అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని లేకుంటే కెపాసిటర్ అమర్చి విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలన్నారు.
భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం పర్ణశాల ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ద్వారా సరిగా నీరు సరఫరా జరగడం లేదని తన దృష్టికి వొచ్చిందని వెంటనే గిరిజన ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా చూడాలని, ఏమైనా పనులు పెండింగ్ లో ఉంటే జనవరి వరకు కంప్లీట్ చేసి ఎండాకాలం కూడా ఇబ్బందులు కలగకుండా పేదలకు నిరంతరం మంచినీటి సరఫరా కావాలన్నారు. ఇరిగేషన్ శాఖ ద్వారా గిరిజన రైతుల పంట పొలాలకు తప్పనిసరిగా సరిపడా నీరు అందించాలని, కెనాల్ చెక్ డ్యాములు మరమ్మతులో ఉన్నవి పూర్తి చేయాలని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఆశ్రమ పాఠశాలలో జిపిఎస్ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని, తక్కువ పిల్లలు ఉన్న చోట ఎక్కువ టీచర్లు ఉంటే వారిని వేరే దగ్గర సర్దుబాటు చేయాలని, గిరిజన పిల్లలు మాత్రం చదువు పరంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గిరిజన గ్రామాలలో అన్ని పీహెచ్సీలలో సిబ్బంది గిరిజనులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని డయాలసిస్ పేషెంట్లకు ప్రత్యేకంగా భద్రాచలంలోనే వైద్యం అందించాలని, ప్రయాణ భారం పడకుండా చెర్ల లో డయాలసిస్ సెంటర్ వెంటనే ప్రారంభించి వైద్య సేవలు అందించాలని అన్నారు.
ధాన్యం కొలుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ వారికి ఇచ్చిన టార్గెట్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని, అలాగే అర్హులైన ప్రతి గిరిజన రైతులకు తప్పనిసరిగా రైతు బోనస్ అందించాలని, ఎవరైనా రైతులు మరణిస్తే వారికి ప్రమాద బీమా పథకం కింద రూ.ఐదు లక్షలు అందించే విధంగా చూడాలని, పత్తి కొనుగోలు విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వడ్లు గానీ పత్తి గానీ తరుగు తేమ అని సాకులు చూపి ఇష్టం వొచ్చినట్టు కోత విధించవద్దని అన్ని సమపాళ్లల్లో పరిశీలించి కొనుగోలు చేసి వారికి సకాలంలో డబ్బులు అందించాలన్నారు. సంబంధిత మెడికల్ ఆఫీసర్లు ఎవరైనా రైతు చనిపోతే వెంటనే వారికి డెత్ సర్టిఫికెట్ అందించాలని ఎవరైనా అశ్రద్ధ చేస్తున్నట్లు తన దృష్టికి వొస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు మాట్లాడుతూ అందరి అధికారుల సహకారంతో భద్రాచలం నియోజకవర్గం ఇందిరమ్మ రాజ్యంగా రూపుదిద్దుకోవాలని అన్నారు. మంత్రి పొంగులేటి ఎంతో శ్రద్ధతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వొచ్చి సంవత్సరం కాలంలోనే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపకానికి శ్రీకారం చుడుతోందని తెలిపారు. గోదావరి వరదలతో ముంపునకు గురయ్యే గ్రామాలకు కరకట్ట నిర్మాణం చేపట్టి 40 శాతం వరకు పూర్తిచేశామని తెలిపారు.
భద్రాచలంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తామని, గిరిజన గ్రామాలలోని సిసి రోడ్లు రైతులకు సాగునీరు కరెంటు, కెనాల్స్ మిషన్ భగీరథ నీరు అందరికీ అందించడానికి అధికారుల సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ సమావేశంలో పెండింగ్ పనులు ఏమైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ,అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఏఎస్‌పి రోహిత్ రాజ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఐ టి డి ఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ పాల్గొన్నారు.