ఎబోలా కేసులు నమోదు కాలేదు

– ప్రజలు ఆందోళన చెందొద్దు
– ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోకి ఎబోలా ప్రవేశించకుండా ఎయిర్‌పోర్టులోనే పటిష్ట చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. ప్రజారోగ్య రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందని అన్నారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎబోలా నివారణ, ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఎబోలా కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఎబోలా బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలోనే స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తూ వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. విమానాశ్రయంలో డాక్టర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్ స్టాఫ్, పారా మెడికల్ సిబ్బందితో ప్రత్యేక బృందం విధులు నిర్వహిస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం  108 అంబులెన్స్‌లను 24 గంటలపాటు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. గాంధీ హాస్పిటల్‌లో పది పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ, డాక్టర్ సునీల్ కుమార్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించామని తెలిపారు. అనుమానితుల శాంపిల్స్ పరీక్షించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎనఐవీ) పుణేకు శాంపిల్స్ పంపించనున్నారు. ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చిన, లక్షణాలు లేని ప్రయాణికులను 21 రోజులపాటు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు, వీరిపై జిల్లా నిఘా బృందాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు వివరించారు. ఈ నెల 25 నాటికి 58 మంది ప్రయాణికులు ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారని, వీరిలో ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. వీరిని  కేటగిరీ-1 కింద వర్గీకరించి 21 రోజుల హోమ్ ఐసోలేషన్‌లో ఉంచామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వ్యాధి లక్షణాలున్న ప్రయాణికులను వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ప్రొటోకాల్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విమానాశ్రయ అధికారులు, జిల్లా నిఘా బృందాలు, హాస్పిటల్స్ మధ్య సమన్వయం పటిష్టంగా ఉండాలన్నారు. సమీక్షలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *