– దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా పులిగుండాల
– ప్రాజెక్ట్ పరిసరాల్లో కాటేజీల నిర్మాణానికి రూ.4 కోట్లు
– కనకగిరి హిల్స్ అభివృద్ధి పనులు తక్షణమే ప్రారంభించాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– మన ప్రకృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యం
– మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయాలనేది తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ప్రసంగంలోనే రాష్ట్రంలో ఎకో-టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజవర్గంలోని పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టును, అందులో భాగంగా ఏర్పాటు చేసిన కాటేజీలు, బోటింగ్, జంగిల్ సఫారీలను ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. జిల్లాలోని కనకగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి బడ్జెట్‌లోనే నిధులు కేటాయించినట్లు వివరించారు. పులిగుండాల చెరువు వద్ద టూరిజం అభివృద్ధికి రూ.4 కోట్లు అవసరమని స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ చెప్పారని, ఆ నిధులలో రూ.2 కోట్లు హరిత నిధి నుంచి, మిగిలిన రూ.2 కోట్లను సీఎసఆర్ ఫండ్స్ నుంచి ఇస్తామని భట్టి ప్రకటించారు. పర్యాటకుల రాకపోకలకు వీలుగా కనకగిరి నుంచి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. ఈ పనులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన కాలపరిమితి రూపొందించి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుతో పర్యాటకులు రావడం వల్ల స్థానిక హోటళ్లు, ఇతర చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకృతిని ఏమాత్రం దెబ్బతీయకుండా, సహజ సిద్ధమైన వాతావరణంలోనే పర్యాటక అభివృద్ధి జరగాలని అధికారులకు స్పష్టం చేశారు. పులిగుండాల ప్రాజెక్టు, కనకగిరి గుట్టలు, కల్లూరు గుట్టలను కలిపి ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం కేవలం రాష్ట్రంలోనే కాక దేశ పటంలోనే ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులను తక్షణమే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ పర్యాటక ప్రాంతాన్ని మనందరి ఆస్తిగా భావించి అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలకు, దేశానికి గర్వకారణంగా చూపిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెటి శ్రీనివాస రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పీసీసీఎఫ్ అధికారి సువర్ణ, సీసీఎఫ్ భీమానాయక్, పీఎఫఓ ఖమ్మం విక్రంసింగ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు నాయుడు సత్యనారాయణ, రాయల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




