ప్రపంచాన్ని ఆకట్టుకునేలా పర్యాటకాభివృద్ధి

– పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి
– కుతుబ్ షాహీ టూంబ్స్ లో పనుల  పరిశీలన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: రాష్ట్రంలో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా వాటిని అభివృద్ధి చేయడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్‌లోని ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్‌లో జరుగుతున్న పనులను ఆయన బుధవారం పరిశీలించారు. వక్ఫ్ ట్రిబ్యునల్‌లో కేసు పెండింగ్ గురించి చర్చించారు. ట్రిబ్యునల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను మినహాయించి మిగిలిన పనులను వారంలోగా ప్రారంభించి, వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెవెన్ టూంబ్స్ కటోరా హౌస్, కేబీ మ్యూజియంను ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌తో కలిసి పరిశీలించారు.

టూంబ్స్ నుంచి గోల్కొండ కోటకు రోప్ వే

కుతుబ్ షాహి టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు 1.3 కిలోమీటర్ల రోప్ వే నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయని ఆరా తీశారు. క్లియరెన్స్ స్టేజిలో ఉన్నాయని, ఆయా శాఖల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే డీపీఆర్ సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు. అనంతరం కటోరా హౌస్‌ను సందర్శించారు. పురావస్తు శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని సమన్వయం చేసుకుని డీపీఆర్‌ను సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. కటోరా హౌస్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. కటోరా హోస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యర్థాలను వెనువెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. తర్వాత గోల్కొండ కోట సమీపంలోని బస్ స్టాప్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో లాడ్ బజార్ తరహాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాన్నారు. ఈ ప్రతిపాదనలను నేషనల్ మాన్యుమెంట్ మిషన్ అథారిటీకి పంపి అనుమతులు పొందాలని సూచించారు. అక్కడినుంచి ఖజానా బిల్డింగ్ మ్యూజియంకు చేరుకున్నారు. ఎంతో చరిత్రాత్మక, విలువైన కళాఖండాలు ఉన్న ఈ మ్యూజియంను పర్యాటకంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రదేశంలో చేనేత వస్త్రాల(ఖాదీ) ప్రదర్శనను ఏర్పాటు చేయాలని పురావస్తు, టీజీటీడీసీ, కులీ కుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులను ఆదేశించారు. కేబీ మ్యూజియం వెనక భాగంలో ఉన్న ఆక్రమణలను పోలీస్ శాఖ సహకారంతో వారం రోజుల్లో తొలగించాలన్నారు. కార్యక్రమంలో టీజీటీడీసీ ఎండీ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *