ఈనెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు

  • చివ‌రిరోజు డిసెంబర్ 9న వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు,
  • వివ‌రాలు వెల్ల‌డించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 9 : రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కావొస్తున్నందున‌ ఈనెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన శ‌నివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయరాజ్, వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని ఎన్నో విప్లవాత్మక, ఊహకు అందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమాలను షో కేస్ చేస్తూ, ప్రభుత్వ విజన్ ను తెలియచేసేవిధంగా ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నామని వివరించారు. ఈ 26 రోజుల కార్యక్రమాల్లో ప్రభుత్వ గ్యారెంటీ పథకాలైన మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతోపాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అధివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై చైతన్య పరుస్తామని తెలిపారు. ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను భ‌ర్తీచేశామ‌ని దాదాపు రూ.18వేల కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేయడంతోపాటు మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామ‌ని గుర్తు చేశారు. మూతపడిన కమలాపూర్ రేయన్స్ పరిశ్రమను రూ.4వేల కోట్లతో పునరుద్ధరించబోతున్నామని తెలిపారు.

పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం రోజున ప్రారంభమయ్యే ఈ ప్రజా విజయోత్సవాల సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని, చివరి రోజైన డిసెంబర్ 9 న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామ‌న్నారు. వివిధ శాఖలకు సంబందించిన పాలసీ విధానాలను ప్రకటిస్తామని వివరించారు. పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చడం, స్పోర్ట్ యూనివర్సిటీకి ఫౌండేషన్,16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల కళాశాలల ప్రారంభోత్సవం, ఉస్మానియా హాస్పిట‌ల్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. అదేవిధంగా, పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలను కూడా నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ముఖ్య కార్యదర్శులు రవీ గుప్త, క్రిస్టినా జోంగ్తు, ఎం. శ్రీధర్, కార్యదర్శి దాసరి హరిచందన, లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page