– ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
– వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పక్కా ఏర్పాట్లు చేయాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : పబ్లిక్ గార్డెన్‌లో ఈనెల 17న నిర్వహించే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోజు ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించి అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద, పబ్లిక్ గార్డెన్‌లో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలకు, చారిత్రక కట్టడాలకు విద్యుద్దీపాల అలంకరణ చేపట్టాలన్నారు. ఈనెల 15న డ్రెస్ రిహార్సల్స్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వేయిమంది స్వయం సహాయక మహిళలతోపాటు రెండు వేల మంది హాజరవుతారన్నారు. సమావేశానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదాబాద్ సి.పి.సజ్జనార్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితర సీనియర్ అధికారులు హాజయ్యారు.
వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పక్కా ఏర్పాట్లు చేయాలి
వానాకాలం (2026-27 ఖరీఫ్) సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. సుమారు 57.7 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 119.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు సీఎస్ తెలిపారు. సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. గత సీజన్‌లో సుమారు 70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగి 154.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సీఎస్ తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), ఇతర కొనుగోలు ఏజెన్సీల సమన్వయంతో కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం ప్రారంభమవుతుందని, నవంబర్‌లో పెద్దఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం రవాణా, హమాలీల ఏర్పాటు, గోదాములు, నిల్వ సామర్థ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు.
రైతుల వివరాల నమోదు
ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని సీఎస్ సూచించారు. రైతుల ఆధార్ వివరాలను చెల్లింపుల కోసం ఉపయోగించే బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసే ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వ, చెల్లింపుల ప్రక్రియలో ఎక్కడా జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయం ఉండాలని, రైతులకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ డిఎస్.చౌహాన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





