నీటి సమస్యపై సానుకూల పరిష్కారం

– కర్నాటక, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు ఒప్పందం –
– పరస్పర అవగాహనతోనే కృష్ణా జలాల వినియోగం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : నీటి వినియోగంపై ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు అనుకూలంగా ఉండేలా ఒడంబడిక కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ`కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై కర్ణాటక చిన్న నీటితరహా శాఖ మంత్రి బోసురాజు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డితో సచివాలయంలో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కృష్ణా జలాలు రెండు రాష్ట్రాల వినియోగంపై పరస్పర అవగాహనతో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు నిర్వహించామన్నారు. భవిష్యత్తులో అనుసరించబోయే విధానాలు ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనాకారిగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా అనుసరించాల్సిన ప్రతిపాదనలను కర్ణాటక  మంత్రి బోసురాజుకు సమగ్రంగా వివరించినట్లు తెలిపారు. కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ సాగు, తాగునీటి హక్కుల పరిరక్షణ, భవిష్యత్ అవసరాలకు అనుసరించాల్సిన విధివిధానలపై ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలిపారు. అంతర్ రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూపొందించిన ప్రతిపాదనలు కర్ణాటక ముందుంచినట్లు చెప్పారు. కృష్ణా జలాల వినియోగంపై జరిగిన చర్చలలో తెలంగాణ రైతాంగం అవసరాలకు పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ చర్చల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించి సమష్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, రాయచూరు ఎంపీ జి.కుమార్ నాయక్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిలతోపాటు రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసన్నగౌడ, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, శివకుమార్ రెడ్డి, వంశీకృష్ణ, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్ ,సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఇ.ఎన్.సి రమేష్‌బాబు, కర్ణాటక రాష్ట్ర చిన్నతరహా నీటిపారుదల శాఖ   కార్యదర్శి బి.కె.పవిత్ర తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *