రేషన్ షాపులకు పోర్టబిలిటీ పోటు!

– ఈ-పాస్ వైఫల్యం.. పట్టణాలు, నగరాల్లో క్యూలైన్ల నరకం
– పల్లెల్లో దారిమళ్లుతున్న బియ్యం
– అమల్లోకి రాని ఆటోమేటెడ్ రిప్లేనిష్మెంట్ సిస్టమ్
– మొరాయిస్తున్న మిషన్లు, సెంట్రల్ సర్వర్లు
– మూడు నెలల రేషన్ స్టంట్ వెనుక మతులబేంది?
– వందల కోట్ల సీఎమ్మార్ రీసైక్లింగ్ మాఫియా

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్

రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ఒకవైపు కోట్లాదిమంది నిరుపేదలకు ఆకలి తీర్చే అభయహస్తంగా నిలుస్తుండగా మరొవైపు వ్యవస్థాగత లోపాలు, సాంకేతిక అవరోధాలు, అక్రమార్కుల రీసైక్లింగ్ మాఫియా కారణంగా తీవ్ర విమర్శలకు గురవుతున్నది. తెల్లరేషన్ కార్డు కలిగిన సామాన్య పౌరుడు నెలవారీ రేషన్ బియ్యం పొందడానికి ఎదుర్కొంటున్న నరకయాతన నుంచి, మిల్లర్లు, వ్యాపారులు ప్రభుత్వ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రూ.వందల కోట్ల కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్) కుంభకోణాల వరకు ఈ వ్యవస్థలోని ప్రతి అంశం తీవ్ర విమర్శనాత్మక పరిశీలనకు డిమాండ్ చేస్తున్నది. పౌర సరఫరాల శాఖ, సంబంధిత నివేదికల ప్రకారం రాష్ట్రవ్యా ప్తంగా విస్తరించి ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ పరిమాణం అత్యంత భారీగా ఉన్నది. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా, మండలస్థాయి స్టాక్ పాయింట్లు (ఎంఎల్ఎస్) 170 ఉన్నాయి. 17,348 రేషన్ షాపులు ఉండగా, ఆన్లైన్ రేషన్ షాపులు 17,268, ఆఫ్లైన్ రేషన్ షాపులు 80 ఉన్నాయి. తెల్లరేషన్ కార్డులు సుమారు 1.01 కోట్ల నుంచి 1.05 కోట్లు ఉన్నాయి. మొత్తం లబ్దిదారులు 3.25 కోట్ల నుంచి 3.39 కోట్లు ఉన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డులు 56.58 లక్షలు ఉండగా, వాటి లబ్దిదారులు 1.91 కోట్ల మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహార భద్రతా (ఎస్ఎఫ్ఎస్ సీ) కార్డులు 48.83 లక్షలు ఉండగా, వాటి లబ్ధిదారులు 1.48 కోట్లు ఉన్నారు. పీడీఎస్ కింద నెలకు సగటు బియ్యం పంపిణీ 2.13 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, వార్షిక బియ్యం పంపిణీ కేటాయింపు 25.56 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతినెలా పంపిణీ చేసే ఈ భారీ బియ్యం కోటా ఉపాధి, వ్యాపారం, విద్యా సంబంధిత కారణాల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య పంపిణీ అయ్యే క్రమంలో పలు వ్యత్యాసాలకు లోనవుతున్నది.

దుకాణాలకు అందని అదనపు కేటాయింపులు 

గ్రామీణ ప్రాంతాల్లో నమోదైన కార్డుదారుల సంఖ్య ఆధారంగా పౌర సర ఫరాల శాఖ ప్రతి నెలా సదరు గ్రామానికి చెందిన చౌక ధరల దుకాణానికి తలా 6 కిలోల చొప్పున బియ్యం కోటాను కేటాయిస్తుంది. అయితే ఉపాధి, విద్య, వ్యాపార నిమిత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి వంటి నగర ప్రాంతాలకు కుటుంబాలు పెద్ద ఎత్తున వలస వెళ్తున్నాయి. జాతీయ ఆహార భద్రతలో భాగంగా అమల్లోకి వచ్చిన “ఒకే దేశం – ఒకే రేషన్ కార్డ్” (ఓఎన్టీఆర్ సీ), రాష్ట్రస్థాయి పోర్టబిలిటీ ని బంధనల ప్రకారం, లబ్ధిదారులు తమకు అనుకూలమైన ఏ చౌక ధరల దుకాణంలోనైనా రేషన్ పొందే వెసులుబాటు ఉన్నది. ఈ పోర్టబిలిటీ సౌక ర్యం కారణంగా సొంత గ్రామంలో రేషన్ తీసుకోని కుటుంబాల సంఖ్య పెరుగుతున్నది. రికార్డుల ప్రకారం గ్రామానికి బియ్యం సరఫరా అయినప్ప టికీ, లబ్దిదారులు అక్కడ బియ్యం తీసుకోకపోతే ఆ నిల్వలు చౌక ధరల దుకాణంలో క్లోజింగ్ స్టాక్ గా మిగిలిపోవాలి. మరుసటి నెల ఇండెంట్ తయారు చేసేటప్పుడు ఈ మిగులు నిల్వను తగ్గించి కొత్త స్టాక్ పంపాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలు భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తు న్నాయి. స్థానిక డీలర్లు సాంకేతిక లోపాలు, నెట్వర్క్ సమస్యలను సాకుగా చూపి రికార్డుల్లో అస్పష్టతను సృష్టిస్తున్నారు. గ్రామంలో ఉండి బియ్యం తీసుకోని వారి వివరాలను గుర్తించి, రేషన్ సేకరించే దళారులతో డీలర్లు చేతులు కలుపుతున్నారు. ఈ బియ్యాన్ని అధికారిక వ్యవస్థ దాటి కిలో రూ. 10 నుంచి రూ.18 వరకు బహిరంగ మార్కెట్ ఏజెంట్లకు విక్రయిస్తూ అక్ర మార్జనకు పాల్పడుతున్నారు. మరొకవైపు, నగర ప్రాంతాల్లో పోర్టబిలిటీ తీవ్రమైన అలజడికి కారణమవుతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గరి జిల్లాల్లో అత్యధిక రేషన్ కార్డులు ఉండడమే కాకుండా వలస దారుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటున్నది. నగరాల్లోని నిర్దిష్ట రేషన్ దుకాణాలకు కేటాయించిన స్టాక్, పోర్టబిలిటీ ద్వారా వచ్చే అదనపు లబ్దిదా రుల వల్ల త్వరితగతిన ఖాళీ అయిపోతున్నది. ఫలితంగా, స్థానికంగా ఉన్న కార్డుదారులు గంటల తరబడి క్యూలలో నిలబడి చివరకు ఖాళీ చేతులతో వెనుతిరగాల్సి వస్తున్నది. దినసరి కూలీలు రేషన్ కోసం తమ పనిదినాలను, వేతనాలను నష్టపోవాల్సి వస్తున్నది. ఈ జిల్లాల్లో వలసదారుల తాకిడి వల్ల కేటాయించిన స్టాక్ త్వరగా అయిపోయి స్థానిక పేదలు రేషన్ పొందలేకపో తున్నారు. పోర్టబిలిటీ ఒత్తిడి ఉన్న దుకాణాలకు 10 శాతం నుంచి 15 శా తం అదనపు నిల్వలను కేటాయించే ఆటోమేటెడ్ రిప్లేనిష్మెంట్ సిస్టమ్ ను అమలు చేయకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సాంకేతిక అవరోధాలతో గందరగోళం  

చౌక ధరల దుకాణాల్లో పారదర్శకత పెంచేందుకు, నకిలీ లబ్ధిదారులను ఏరివేసేందుకు ప్రవేశపెట్టిన ఈ-పాస్ యంత్రాలు, ఆధార్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ వ్యవస్థలు ప్రస్తుతం పంపిణీ ప్రక్రియను సంక్షోభంలోకి నెట్టాయి. సాధారణంగా ఒక లబ్దిదారుడు రేషన్ షాపునకు వచ్చినప్పుడు, డీలర్ ఈ-పాస్ యంత్రంలో కార్డు సంఖ్యను నమోదు చేసి బయోమెట్రిక్ వేలిముద్ర, ఐరిస్ స్కాన్ సేకరిస్తారు. ఈ డేటా పౌర సరఫరాల శాఖ సర్వర్ల కు, ఆపై కేంద్ర ఆధార్ ప్రామాణీకరణ సర్వర్లకు అనుసంధానమై ఆమోదం పొందాలి. అయితే క్షేత్రస్థాయిలో ఈ ప్రాసెస్ తీవ్ర జాప్యంతో సాగుతున్నది. 4జీ, 5జీ సాంకేతికత అవసరమైన చోట, నేటికీ అనేక దుకాణాల్లో కాలంచె ల్లిన 3జీ సాంకేతికతతో పనిచేసే మందకొడి ఈ-పాస్ యంత్రాలనే విని యోగిస్తున్నారు. దీనివల్ల డేటా బదిలీ అత్యంత నెమ్మదిగా జరుగుతున్నది. పౌర సరఫరాల శాఖ సెంట్రల్ సర్వర్లతో పాటు, రాష్ట్ర పోర్టల్ను కేంద్ర ప్రభు త్వ పోర్టల్తో విలీనం చేసిన సందర్భాల్లో సాంకేతిక లోపాలు తలెత్తి రోజులో ఎక్కువ సమయం ‘సర్వర్ బిజీ’ సందేశాలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం 9:30 నుంచి 11:00 గంటల మధ్య రద్దీ సమయాల్లో సర్వర్లు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. ఇటీవల ఈ-పాస్ అప్లికేషన్లో చేసిన మార్పుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ కేటాయింపు 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపు 1 కిలోను వేర్వేరుగా అప్లోడ్ చేయాల్సి వస్తున్నది. దీనితో ఒకే నెల కోటా కోసం లబ్దిదారుడు రెండుసార్లు బయోమెట్రిక్ వేలిముద్ర వేయాల్సి వస్తున్నది. ఫలితంగా ప్రతి లావాదేవీకి పడే సమయం రెట్టింపై దుకాణాల వద్ద వందలాది మందితో భారీ క్యూలు ప్రత్యక్షమవుతున్నాయి. సగటున సాధారణ రోజుల్లో నెలకు 15 రోజుల పాటు మాత్రమే రేషన్ దుకాణాలు నిరంతరాయంగా నడుస్తుంటాయి. కానీ ఈ సాంకేతిక విఘాతాల వల్ల నిర్దేశిత గడువులోగా బియ్యం తీసుకోవడం లబ్దిదారులకు సవాలుగా మారుతున్నది.

మూడు నెలల రేషన్ వెనుక ఏమున్నది?

ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉదాహరణకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని (ప్రతి వ్యక్తికి 18 కిలోలు) ఒకే సైకిల్లో పంపిణీ చేసే నిర్ణయం తీసుకున్నది. భారీ వర్షాలు, వరదల సమయంలో రవాణా అంతరాయాలు ఏర్పడి పేదలకు ఆహార కొరత రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు పంపిణీ చేపట్టినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని అమలు తీరు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు, అపోహలకు దారితీస్తున్నది. మూడు నెలల రేష నన్ను ఒకేసారి ఇస్తున్నప్పుడు, ఈ-పాస్ అప్లికేషన్లో ప్రతి నెలకూ, ప్రతి కోటాకు వేర్వేరుగా డేటా అప్లోడ్ చేయాల్సి రావడంతో ఒక కుటుంబం ఏకంగా ఆరుసార్లు బయోమెట్రిక్ వేలిముద్రలు వేయవలసి వస్తున్నది. దీనివ ల్ల ఒక్కో కార్డుదారునికి 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టి, రేషన్ దుకాణాల వద్ద తొక్కిసలాట వాతావరణం నెలకొంటున్నది. భవిష్యత్తులో బియ్యం బంద్ అవుతాయేమోననే, కోటా దొరకదేమోననే భయంతో లబ్ధిదా రులు ఒకేసారి దుకాణాలకు తరలిరావడం సాంకేతిక వ్యవస్థను మరింత కుప్పకూల్చుతున్నది. కొందరు విమర్శకుల విశ్లేషణ ప్రకారం ఇటువంటి నిర్ణయాల వెనుక ముందస్తు ఆహార భద్రతతో పాటు కొన్ని పరిపాలనాపర మైన వ్యూహాలు కూడా దాగి ఉన్నాయి. గోదాముల్లో ఎక్కువ కాలం ఉండి నాణ్యత దెబ్బతింటున్న పాత బియ్యం నిల్వలను ఖాళీ చేయడం, రవాణా కాంట్రాక్టర్ల వ్యయాన్ని తగ్గించడం, ఇతర సామాజిక – రాజకీయ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం వంటి అంశాలు ఇందులో అంతర్లీనంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. పాండమిక్, కరువు వంటి విపత్తు హెచ్చరి కలు ఏవీ లేనప్పటికీ, సరైన మౌలిక సాంకేతిక వసతులు కల్పించకుండా ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని తోసివేయడం ప్రజా పంపిణీ వ్యవస్థలోని అసంబద్ధ నిర్వహణకు అద్దం పడుతున్నది.

వడ్లు బుక్కుతున్న మిల్లర్లపై సర్కార్ ప్రేమ

రేషన్ బియ్యం సరఫరా వ్యవస్థలో అత్యంత వినాశకరమైన, భారీ ఆర్థిక నేరం బియ్యం రీసైక్లింగ్ విధానం. ప్రభుత్వం సేకరించే వడ్లకు, ప్రజలకు పంచే బియ్యానికి మధ్య జరిగే ఈ రీసైక్లింగ్ ప్రక్రియ ఒక నిరంతర విషవలయంగా మారింది. ఈ అక్రమ ధనచక్రం వివిధ దశల్లో సాగుతున్నది. ప్రభు త్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు నుంచి వడ్లను సేకరించి కస్టమ్. మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) కింద రైస్ మిల్లర్లకు అప్పగిస్తుంది. నిబంధనల ప్రకారం మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, నిర్దేశిత నిష్పత్తిలో బియ్యాన్ని ప్రభుత్వ గోదాములకు అప్పగించాలి. అయితే కొందరు అవినీతి మిల్లర్లు ప్ర భుత్వం ఇచ్చిన నాణ్యమైన వడ్లను మిల్లింగ్ చేయకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతోపాటు ఇతర బహిరంగ మార్కెట్కు మళ్లించి ఎక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. మరొకవైపు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని నాణ్యతా లోపాలు, వ్యక్తిగత ప్రాధాన్యతల వల్ల చాలామంది కార్డుదారులు నేరుగా వినియోగించకుండా, కిలో రూ. 10 నుంచి రూ.15 లకు స్థానిక దళారులకు, ఏజెంట్లకు అమ్మే స్తున్నారు. ఈ దళారులు గ్రామాలు, పట్టణాల నుంచి రేషన్ బియ్యాన్ని భారీ ఎత్తున సేకరించి, తిరిగి రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు చేరవేస్తున్నారు. మిల్లర్లు ఈ పీడీఎస్ రేషన్ బియ్యాన్నే కొనుగోలు చేసి, తమ మిల్లుల్లో రీ-పా లిష్ పట్టి, నేరుగానో ప్యాక్ చేసి, ప్రభుత్వం తమకు కేటాయించిన ధాన్యం నుంచి వచ్చిన “సిఎన్ఆర్ బియ్యం”గా పౌర సరఫరాల శాఖ గోదాముల్లో జమ చేస్తున్నారు. ప్రభుత్వం తాను గతంలో ఉచితంగా పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్నే మళ్లీ నూతన సిఎన్ఆర్ బియ్యంగా స్వీకరిస్తూ, మిల్లర్లకు మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తున్నది. అనంతరం ఇదే బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ తిరిగి చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్నది. ఈ కుంభకోణం పరిమాణం ఊహించని స్థాయిలో ఉన్నది. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన విస్తృత తనిఖీల్లో సుమారు 50 కి పైగా రైస్ మిల్లులు ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి, రూ.500 కోట్ల విలువైన అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. మరొక తనిఖీ నివేదికలో రూ. 154 కోట్ల విలువైన సిఎన్ఆర్ బియ్యం దారిమళ్లినట్టు అధికారికంగా నిర్ధారణ అయింది. ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యాన్నే కొనుగోలు చేసి, మళ్లీ ప్రభుత్వానికే విక్రయిస్తూ మిల్లింగ్ చార్జీలు దండుకుంటున్న రైస్ మిల్లర్లు, దళారులపై రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆస్తుల జప్తు, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ప్రేమ ఒలకబోస్తున్నది.

పీడీఎస్ ప్రక్షాళన తక్షణావసరం

ప్రజా పంపిణీ వ్యవస్థలో వేళ్లూనుకున్న ఈ సమస్యలను నివారించి, పారదర్శకతను పునరుద్ధరించడానికి ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. పూర్తిగా కాలం చెల్లిన 3జీ ఈ-పాస్ యంత్రాల స్థానంలో నూతన 4జీ, 5జీ సామర్థ్యం ఉన్న పరికరాలను పంపిణీ చేయాలి. ఈ-పాస్ సాఫ్ట్వేర్లో కేంద్ర, రాష్ట్ర కోటాలకు విడివిడిగా బయోమెట్రిక్ తీసుకునే సంక్లిష్ట పద్ధతిని తీసివేసి, ఒకే ఒక్క వేలిముద్రతో సమగ్ర లావాదేవీ పూర్తయ్యేలా సింగిల్ – విండో ప్రాసెస్ ప్రవేశపెట్టాలి. ఆధార్ ప్రామాణీకరణ సెంట్రల్ సర్వర్ల బ్యాండ్విడ్ను పెంచడం ద్వారా సర్వర్ క్రాష్లను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. పోర్టబిలిటీ వినియోగం ఎక్కువగా ఉండే నగర, పట్టణ ప్రాంతాలను గుర్తించి, ఆయా చౌక ధరల దుకాణాలకు ముందస్తుగా 10 శాతం నుంచి 15 శాతం వరకు అదనపు నిల్వలను కేటాయించాలి. రవాణా, నిల్వల డేటాను రియల్-టైమ్లో పర్యవేక్షించే ఆటోమేటెడ్ రిప్లేనిష్మెంట్ సిస్టమ్ను (ఏఆర్ఎస్)ను ఇంప్లిమెంట్ చేయాలి. ధాన్యం సేకరణ నుంచి బియ్యం అప్పగింత వరకు ప్రతి దశలోనూ క్యూఆర్ కోడ్, డిజిటల్ టాగింగ్ సిస్టమ్ అమలు చేయాలి. గోదాములకు వచ్చే బియ్యం పీడీఎస్ కింద రీసైకిల్ అయినదా లేదా కొత్తగా మిల్లింగ్ చేసినదా అని నిర్ధారించడానికి శాస్త్రీయ ల్యాబ్ పరీక్షలు నిర్వహిం చాలి. రవాణా వాహనాలకు పూర్తిస్థాయి జియో ఫెన్సింగ్, జీపీఎస్ ట్రాకిం గ్ తప్పనిసరి చేయాలి. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులను జప్తు చేయాలి. పేద లు పీడీఎస్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా ఉండాలంటే, నాణ్యమైన సన్న బియ్యాన్ని పీడీఎస్ ద్వారా సరఫరా చేయాలి. కార్డుదారులే స్వయంగా వినియోగించుకునే నాణ్యమైన బియ్యం లభించినప్పుడు, దళారు లకు బియ్యం అమ్మే ధోరణి తగ్గి రీసైక్లింగ్ మాఫియాకు మూలం వద్దనే సరఫరా నిలిచిపోతుంది. తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ కోట్లాది మంది నిరుపేదల ఆహార భద్రతకు ప్రాణాధారంగా నిలుస్తున్నది. అయినప్పటికీ మందకొడి సాంకేతికత, సర్వర్ లోపాలు, అసంబద్ధ నిబంధనలు లబ్ధిదారు లను గంటల తరబడి క్యూలలో నిలబెట్టి నరకయాతనకు గురిచేస్తుండగా, మరొకవైపు మిల్లింగ్ మాఫియా, దళారులు ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటు న్నది. కేవలం పథకాలను ప్రకటించడానికే పరిమితం కాకుండా, పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం అమలు చేసినప్పుడే ఆహార భద్రతా చట్టం నిజమైన లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని, పీడీఎస్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *