– విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
– రవాణా శాఖాధికారులతో మంత్రి పొన్నం జూమ్ సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో, ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని, అందరూ సమర్థవంతంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేవెళ్ల మండలంలో సోమవారం ప్రమాదం జరిగిన నేపథ్యంలో రవాణా శాఖాధికారులతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. చేవెళ్ల ప్రమాదం రెండు వాహనాలకు ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడం వల్ల జరిగిందన్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందంటూ వాహనాల స్పీడ్ లాక్ ఎంతవరకు అమలవుతున్నదో చూడాలని, దాన్ని బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలని ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు, ఎన్‌ఫోర్సుమెంట్ సీరియస్‌గా, యాక్టివ్‌గా ఉండాలని గట్టిగా చెప్పారు. ఘటన జరిగినప్పుడు దాడులే కాదు నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను అదుపు చేయవచ్చన్నారు. ప్రజలకు వేధింపులు లేకుండా రవాణా శాఖ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, ఈ శాఖలోకి కొత్తగా వచ్చిన ఉద్యోగులను సీనియర్లు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. టిప్పర్ లారీలు ఇసుక, డస్ట్ తీసుకెళ్లేటప్పుడు టార్పాలిన్ కప్పాలని ఆయన గట్టిగా చెప్పారు. డీటీసీ, ఆర్టీవోలు, ఇతర రవాణా శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో మూడు బృందాలుగా ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధాన్యం తరలింపునకు ఉపయోగించే వాహనాలపై వేధింపులు వద్దని, వాణిజ్య వాహనాలు, ప్రయాణికులను తరలించే వాహనాలు, మైన్స్ మినరల్స్ తరలించే వాహనాల్లో నిబంధనలు పాటించని వాటికి భారీ జరిమానాతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులు, అందులో కార్గో సరకులు తరలించినా కఠినంగా వ్యవహరించాలన్నారు. స్కూల్ బస్పు, అద్దె బస్సు, ట్రక్కులు, టిప్పర్‌లు, లారీల ఫిట్‌నెస్ పర్మిట్‌లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ఆదేశించారు. రోడ్ సేఫ్టీ మంత్ ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని, దానికన్నా ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయాలని అన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెట్రరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు, డీటీసీలు, ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





