బాయిల్డ్ రైస్ సేకరించండి

– పాత బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి
– పోషకాహార బియ్యం పంపిణీని పునఃప్రారంభించండి
– కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వినతి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పండే యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. దిల్లీలో కేంద్ర మంత్రి జోషిని ఆయన నివాసంలో రేవంత్, ఉత్తమ్‌లు శుక్రవారం ఉదయం కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని వారు కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్(5 శాతం నూకతో), 5 ఎల్‌ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అలాగే 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి తెలియజేశారు. పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. కాగా, పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు పోషకాహార బియ్యాన్ని (ఎఫఆర్‌కే) పాఠశాలలు, వసతి గృహాలు, ఐసీడీఎస్‌ల పరిధిలో పంపిణీ చేసేవారని, ఇటీవల దానిని నిలిపివేశారని, వెంటనే దానిని పునః ప్రారంభించాలని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో దిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *