అటవీ ప్రాంతాన్ని వేల సంఖ్యలో జల్లెడపడుతున్న కేంద్ర బలగాలు
కగార్ పేరుతో దండకారణ్యంలో యుద్ధ్ద వాతావరణం
కాకినాడ నుండి పడవలు కొనుగోలు చేసిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణలోకి ప్రవేశించేందుకు భారీగా వ్యూహరచన
మావోయిస్టుల కదలికలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మావోయిస్టుల కదలికలపై డేగ కన్ను వేసింది. ఇప్పటికే వేల సంఖ్యలో కేంద్ర బలగాలు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యాన్ని చుట్టుముట్టాయి. డ్రోన్ సహాయంతో మావోయిస్టుల కదలికలను భద్రతా బలగాలు పసిగట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే మావోయిస్టులు వందల సంఖ్యలో మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా వేల సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల వద్ద లొంగిపోయిన సంఘటనలు ఉన్నాయి. దీని కారణంగా మావోయిస్టు పార్టీ ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. కొత్త ఆలోచనలకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు మావోయిస్టులకు ఇబ్బందికర వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. దీని కారణంగా ఇటీవల కాలంలో భద్రతా బలగాల చేతిలో అనేక మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కొత్త ఆలోచనలలో భాగంగానే కాకినాడ నుండి పడవలను కొనుగోలు చేసారు.
వర్షాకాలం కావడం వలన వాగులు వేగంగా ప్రవహించే అవకాశం ఉన్నందున పడవల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలివేళ్ళేందుకు పడవలనను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. వాటిని చర్ల వద్ద పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వొచ్చేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మావోయిస్టుల యాక్షన్ టీమ్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తుంది. గత 15 సంవత్సరాల క్రితం కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను పేల్చివేసిన మావోయిస్టులు అప్పటి నుండి ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యకలపాలు నిర్వహించలేదు. అగ్రనేత లచ్చన్న టీమ్ పినపాక మండల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఇది గమనించిన పోలీస్ బలగాలు లచ్చన్నతో సహా ఆరుగురు మావోయిస్టులను హతమార్చింది. దీనితో మావోయిస్టు పార్టీకి తీవ్రంగా లోటు ఏర్పడింది.
మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోకి గోదావరి పరివాహక ప్రాంతంలోని దండకారణ్యంలో సేఫ్ జోన్‌ను ఏర్పాటు చేసుకుననేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మావోయిస్టులపై డేగకన్ను వేసిన పోలీస్ బలగాలు ప్రతినిత్యం దండకారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే పొలీస్ ప్రత్యేక నిఘా టీమ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మావోయిస్టుల సేఫ్ జోన్ కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు పాగా వేసేందుకు కొత్త తరహా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి రెండు కిలోమీటర్ల దూరంలో భద్రతా బలగాలు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితిలో మావోయిస్టుల కదలికలపై కేంద్ర బలగాలు ప్రత్యేక నిఘా పెట్టినట్టే తెలిసింది. ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల పోరాటంలో సామాన్య ప్రజలు తీవ్ర భయాంధోళన చెందుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు సామాన్య ప్రజలు తరలివెళ్తున్నట్లు సమాచారం.