– 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి స్వాధీనం..
– 63 కేసుల నిందితుడు అరెస్ట్
– దుబ్బాక పోలీసుల సక్సెస్
– ప్రత్యేక బృందాలను అభినందించిన సీపీ రష్మి
సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 15: సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును సిద్దిపేట పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. సుమారు 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి, నగదును స్వాధీనం చేసుకుని, 63 కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగ చిక్కుడు కృష్ణ అలియాస్ వెంగలి బిక్షపతిని అరెస్టు చేశారు.పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ పర్యవేక్షణలో ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దాదాపు 400 నుంచి 500 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితుడి కదలికలను గుర్తించాయి. ముస్తాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టి చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం, దుబ్బాకకు చెందిన వ్యాపారి చింత రాజ్‌కుమార్ కుటుంబంతో కలిసి ఉత్తర భారతదేశ తీర్థయాత్రకు వెళ్లిన సమయంలో, జూన్ 28 అర్ధరాత్రి నిందితుడు ఇంటి కిటికీ ఊచలను ఇనుపరాడ్లు, టేకు దుంగలతో వంచి లోనికి ప్రవేశించాడు. అనంతరం ఇంట్లో ఉన్న తాళాలతో లాకర్‌ను తెరిచి బంగారం, వెండి, నగదు అపహరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూన్ 29న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసులు నిందితుడి వద్ద నుంచి 80 తులాల బంగారు ఆభరణాలు, 5.5 కిలోల వెండి ఆభరణాలు, రూ.1,300 నగదు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.విచారణలో నిందితుడిపై సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో కలిపి 63 చోరీ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఇటీవల బాన్సువాడ చోరీ కేసులో జైలుశిక్ష అనుభవించిన సమయంలో జైలు వార్డర్‌తో ఏర్పడిన పరిచయంపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసును ఛేదించిన ఏసీపీ ఎం. రవీందర్‌రెడ్డి, సీసీఎస్ ఏసీపీ సదన్ కుమార్, సీసీఎస్ సీఐ జాన్‌రెడ్డి, సీఐలు రవీందర్, వాసుదేవరావు, ఎస్‌ఐ కీర్తిరాజు, హరీష్, దామోదర్‌తో పాటు సీసీఎస్, క్రైమ్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ అభినందించారు.
ప్రజలకు పోలీసుల సూచనలు
ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఎక్కువ రోజుల పాటు ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇళ్ల కిటికీలు, ప్రధాన తలుపులకు బలమైన స్టీల్ భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




