– బాధితురాలికి రూ.12 లక్షల పరిహారం
– ఒక్కో నిందితుడికి రూ.20 వేల జరిమానా
– జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక తీర్పు
జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 15: మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలిచే తీర్పును జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు వెలువరించింది. మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 అక్టోబర్‌లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార (గ్యాంగ్‌రేప్) కేసులో ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు, వారందరికీ జీవిత ఖైదు విధించింది. అలాగే ఒక్కో నిందితుడికి రూ.20,000 జరిమానా విధిస్తూ, బాధిత బాలికకు రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రధాన జిల్లా సెషన్స్ జడ్జి (ఎఫ్‌ఏసీ), ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి రత్న పద్మావతి ఈ సంచలన తీర్పును వెలువరించారు. ఈ కేసులో మెట్‌పల్లి పోలీసులు నమోదు చేసిన నేరాన్ని అప్పటి డీఎస్పీలు గౌస్ బాబా, రవీంద్రరెడ్డి సమగ్రంగా దర్యాప్తు చేసి బలమైన సాక్ష్యాధారాలతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు సమర్థవంతంగా వాదనలు వినిపించగా, కోర్టు అన్ని ఆధారాలను పరిశీలించి నిందితులను దోషులుగా నిర్ధారించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ మహిళలు, యువతులు, బాలికలు తమపై జరిగే వేధింపులు, లైంగిక నేరాలు లేదా ఇతర అన్యాయాల విషయంలో ఎలాంటి భయం లేకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నేరస్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు, దర్యాప్తు అధికారులు, అప్పటి ఎస్‌ఐ సదాకర్, సీఎంఎస్ ఎస్‌ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ రంజిత్, సీఎంఎస్ కానిస్టేబుళ్లు ఎం. కిరణ్ కుమార్, శ్రీధర్, రాజు తదితరులను జిల్లా ఎస్పీ అభినందించారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




