బ్లాక్‌ ‌మనీని వైట్‌గా మారుస్తామని మోసం

– అమాయకులకు డబ్బు ఆశ చూపి దోపిడీ
– పోలీసుల వేషంలో బెదిరించి లూటీలు
– సత్తుపల్లి గంగారాం డెకాయిటీ కేసును ఛేదించిన పోలీసులు
– 12 మంది నిందితుల అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు
– దోపిడీదారుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్లు గుర్తింపు

ఖమ్మం,ప్రజాతంత్ర,జూలై2: బ్లాక్‌మనీని వైట్‌గా మారుస్తామని అమాయకులకు ఆశ చూపించి.. అనంతరం పోలీసుల వేషంలో బెదిరించి నగదు దోచుకున్న ముఠాను సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని గంగారంలో జరిగిన సంచలన డెకాయిటీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్‌ ఆధ్వర్యంలోని సత్తుపల్లి పోలీస్‌ ‌ప్రత్యేక బృందాలు ఈ కేసులో ముమ్మర దర్యాప్తు జరిపి మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ ‌చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఈ దోపిడీ ముఠాలో భాగస్వాములు కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అరెస్టైన వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసులో 14మంది నిందితుల్లో 12మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్‌ ‌తెలిపారు. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఓ కానిస్టేబుల్‌, ఆర్‌ఎస్సై కూడా ఉన్నట్లు తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం.. గత నెల 25న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పట్టణ సీఐ టి. శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గంగారం శివారులో నిర్వహిస్తున్న తనిఖీల్లో 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు విషయం తెలిసింది. దర్యాప్తులో ఏలూరు జిల్లా వెంకటాపురానికి చెందిన ఈద చంటిబాబు ఈ ముఠా సూత్రధారిగా గుర్తించారు. అతడు మరో 13 మందితో కలిసి వివిధ సిమ్‌కార్డుల ద్వారా అమాయకులకు ఫోన్‌ ‌చేసి, తాము రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులమని, తమ వద్ద ఉన్న బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకోవాల్సి ఉందని నమ్మించేవారు. రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు ఖాతాలో జమ చేస్తామని ఆశ చూపించి బాధితులను నిర్ణయించిన ప్రాంతానికి రప్పించేవారు. బాధితులు నగదు తీసుకొచ్చిన తర్వాత కరెన్సీ నింపిన బ్యాగును ఇచ్చేవారు. అదే సమయంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం ముఠాలోని కొందరు నిజమైన పోలీసులు నకిలీ పోలీసులతో అక్కడికి చేరుకుని దాడి చేసేవారు. నకిలీ కరెన్సీ వ్యాపారం చేస్తున్నారంటూ బెదిరించి బాధితుల వద్ద ఉన్న నగదును లాక్కొని పరారయ్యేవారు. ఇదే తరహాలో పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో టీజీఎస్పీ 15వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ ‌ముళ్లగిరి వర్ధన్‌, ఆర్‌ఎస్సై బైరా కేశవరావు ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.17.60 లక్షల నగదు, మూడు కార్లు, ఓ స్కూటీ, సెల్‌ఫోన్లు, పోలీసు దుస్తులు, బేడీలు, కరెన్సీ నోట్ల బండిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్ట్ ‌చేస్తామన్నారు. కేసును ఛేదించిన సత్తుపల్లి సీఐ టి.శ్రీహరి ఆధ్వర్యంలోని పోలీసు బృందాన్ని ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. ప్రజలు బ్లాక్‌మనీ మార్పిడి పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్, ‌భారీ లాభాల ఆఫర్లను నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలపాలని ఇవ్వాలని ఏసీపీ వసుంధర యాదవ్‌ ‌సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *