– రంగారెడ్డి జిల్లాలో దారుణం
– పోలీసుల వైఖరికి నిరసనగా బాధిత కుటుంబీకుల ఆందోళన
– షాబాద్ ఎసఐ సస్పెన్షన్
– ఘటనపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి
– కఠినంగా శిక్షిస్తాం : జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల
షాబాద్, జూలై 11 : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో ఆరుగురి హత్య కలకలం రేపింది. పోక్సో కేసు పెట్టారన్న కోపంతో ఓ వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేయడమేగాక తన భార్య, ఇద్దరు పిల్లలను కూడా హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని దైవాలగూడకు చెందిన ఓ బాలిక రాజ్‌కుమార్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ మే 16న తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అతడిని అరెస్టు చేశారు. తనపై పోక్సో కేసు పెట్టిన కుటుంబంపై అతడు కక్ష పెంచుకున్నాడు. బెయిల్‌పై ఇంటికి వచ్చిన అతడు శనివారం తెల్లవారుజామున బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ కుటుంబంలోని ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. బాలికను హత్య చేసే ముందు పొలంలోకి లాక్కెళ్లి లైంగిక దాడి జరిపాడు. అనంతరం తన భార్య సరిత, మూడేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడిని కూడా హత్య చేశాడు. హత్యల తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ‘నేను ఆరుమందిని మర్డర్ చేశాను.. ఒకచోట ముగ్గురిని, మరొకచోట ముగ్గురిని హతమార్చాను.. నేను కూడా చచ్చిపోతున్నా’ అని చెప్పాడు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా అప్రమత్తమైన వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితుడు పరారయ్యాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తన భార్యాపిల్లలను ఎందుకు చంపాడన్నది మిస్టరీగా మిగిలింది. ఈ ఘటనలో ఎలాంటి గ్యాంగ్ ప్రమేయం లేదని, రాజ్‌కుమార్ ఒక్కడే ఆరుగురిని చంపినట్లు స్పష్టం చేశారు. నిందితుడిపై మే 16న పోక్సో కేసు నమోదైందని, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడని తెలిపారు. ‘నిందితుడు రాజ్‌కుమార్ రాత్రి 11 నుంచి 11:30 గంటల మధŠ్యలోనే ఈ ఆరుగురినీ హతమార్చాడు.. మొదట బాధితురాలి ఇంట్లోకి చొరబడి ఆమె తల్లి, నానమ్మలను చంపేశాడు.. బాలికను దైవాలగూడ చెరువు దగ్గరకు తీసుకెళ్లి అక్కడ ఆమెను హత్య చేశాడు.. తర్వాత తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలను కూడా అతికిరాతకంగా హతమార్చాడు.. అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు.. నిందితుడి నేర చరిత్రను పరిశీలిస్తే గతంలో అతడిపై పోక్సో కేసుతోపాటు మరో కేసు కూడా నమోదైంది.. అతడికి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వ్యసనాలు ఉన్నాయి. దీంతో అతనికి రూ.కోటిన్నర వరకు అప్పులు ఉన్నట్లు తేలింది. రాజ్‌కుమార్‌ను పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం’ అని సీపీ వివరించారు. రాజ్‌కుమార్ ప్రయాణించిన కారును పోలీసులు నందిగామ సమీపంలో గుర్తించారు. నిందితుడు కారు వదిలి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలు అతడి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. కారును స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.
షాబాద్ ఎసఐ సస్పెన్షన్
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. పోక్సో కేసును మొదటి నుంచే సక్రమంగా దర్యాప్తు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కేసు విచారణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు షాబాద్ ఎసఐ రమేష్‌ను సస్పెండ్ చేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తమ నిరసనను విరమించారు.
ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి
దైవాలగూడ హత్యల ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆమె ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషితో ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, మానసిక, సామాజిక పరమైన తోడ్పాటు కల్పించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మహిళలు, పిల్లలు, కుటుంబాల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం : దుద్దిళ్ల
ఆరుగురి హత్య ఘటనపై రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్మాదిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపామని, అతడు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారÁని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





