– వచ్చే మార్చి నాటికి మూడు విడతల్లో పూర్తి చేయాలి
– సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
– కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి
ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర,.. జూలై 11 : భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై మంత్రి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘ధరణి’ని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, అయితే చట్టం అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని అంగీకరించారు. భూ భారతి సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని, ముఖ్యమంత్రి ములుగుమాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు శుక్రవారం పంపిణీ చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, ఖమ్మం నుంచి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.
మార్చి 2027 నాటికి మూడు విడతల్లో
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో భూ రీ-సర్వేను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనిపై ప్రతి నెలా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. తొలి విడతలో భాగంగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపట్టినట్లు చెప్పారు. ఇందుకోసం శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తోపాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 కలిపి మొత్తం రూ.60 అందజేస్తామని, విధుల్లో చేరని వారికి గడువు ఇచ్చి ఆపై లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు.
సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణపై ఆరా
ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి హైకోర్టు సమస్యను కూడా పరిష్కరించినప్పటికీ అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని మంత్రి పేర్కొన్నారు. తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వచ్చిన 6,500 రెవెన్యూ సమస్యల్లో 98 శాతం సమస్యలకు భూ రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఒక సర్వే నంబరులో కొంత భూమిని ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత (22-ఎ) జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
గుడిసెల్లో నివసించే వారికే తొలి ప్రాధాన్యం
మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు నిధులు విడుదల చేయాలన్నారు. రెండో విడత ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేయాలని, ఇందులో గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇసుక, కంకర సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికీ కనీసం ఒక జత యూనిఫాం అందేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





