– కన్నెపల్లినుంచి నీటిని లిఫ్ట్ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థత
– హైదరాబాద్‌కు నీటి సమస్య వస్తే ఎట్లా పరిష్కరిస్తారు?
– సుందిళ్లనుంచి ఎల్లంపల్లికి నీరెందుకు తరలించరు?
– మళ్లీ జలదోపిడీకి తలుపులు తెరిచారు
– చంద్రబాబుకు కప్పం కడుతున్నారా?
– ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10!: భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం… కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగలవా? ఒకవైపు “చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం” అంటూ.. మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావంటూ రేవంత్‌రెడ్డిని హరీష్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నెపల్లి నుండి నీళ్ళు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య.28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు చెక్కు చెదరలేదు. లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారు.కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్కే లేదా?ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి..మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం.తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.నీళ్లు ఉండి కూడా ఎత్తిపోకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారింది.ఒక వైపు ఎల్ నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోంది.ఎల్‌నినో కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనలు పక్కనబెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరికి నిదర్శనం.రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యం.నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుంది?తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంది.తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నది.నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్‌లో ఉంచి గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం సిగ్గుచేటు.ఒక్కో పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి?కళ్ల ముందే నీరు ఏపీకి తరలివెళ్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చొంటున్నది?తెలంగాణ రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం, నీళ్ల మంత్రి ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నట్లు?గురుదక్షిణ చెల్లింపులో భాగంగానే కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా తెలంగాణ జలాలను ఏపీకి వదులుతున్నారా? దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి?ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 5.48 టీఎంసీలే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 3.32 టీఎంసీల స్థాయికి చేరువలో ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదు. ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఎల్లంపల్లి స్టేజ్ 1 & 2 ఆయకట్టుకు 12 టీఎంసీ, కడెం లిఫ్ట్ స్కీమ్ కోసం 3 టీఎంసీ, మంథని, రామగుండం సాగునీటి అవసరాల కోసం 2టీఎంసీ, రామగుండం ఎస్‌టీటీపీ కోసం 6.50 టీఎంసీ, ఎన్‌టీపీసీ కోసం 4.73 టీఎంసీ మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరం కోసం 13.67 టీఎంసీ, తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ కోసం 6.57 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 టీఎంసీ కేటాయింపులు ఉన్నాయి.
డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వతో ఈ అవసరాలను ప్రభుత్వం ఎలా తీర్చుతుంది? హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నట్లు? ప్రమాద ఘంటికలు మోగుతున్నా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యం. ప్రజల అవసరాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని హరీష్‌రావు ప్రశ్నించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎగువ గోదావరిలో కొద్దిపాటి వరదలు కూడా రాలేదు. ఎస్సారెస్పీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో కూడా ప్రవాహాలు ఆశించిన స్థాయిలో లేవు. ఎగువ గోదావరిలో ఇలాంటి లోటు ప్రవాహాలు ఉన్న కరువు కాలంలో దిగువ గోదావరిలో లక్ష క్యూసెక్కుల నీరు వృథా గా కిందకు వెళ్ళిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దిగువ గోదావరిలో లభ్యమవుతున్న నీటిని ఒడిసి పట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత. గోదావరిలో వరద లేదని, వానలు లేవని ప్రభుత్వం చెబుతోంది. మరి పట్టిసీమలో 24 మోటార్లు నిరంతరాయంగా ఎలా నడుస్తున్నాయి? గోదావరిలో వరద లేకపోతే పట్టిసీమకు నీరు ఎక్కడి నుంచి వస్తోంది రేవంత్ రెడ్డి?మేడిగడ్డ వద్ద ప్రాణహిత నుంచి ప్రవాహం కొనసాగుతోంది. బరాజ్ వద్ద నీటి మట్టం పంపింగ్‌కు అనుకూలంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా పంపులు ఆన్ చేయడం లేదు. ఇది తెలంగాణ రైతులపై కక్షసాధింపు కాదా?93.5 మీటర్ల వద్ద నుంచే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని పక్కనబెట్టి రైతుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది. రాజకీయ ద్వేషం కోసం రైతులను బలిపశువులను చేయడం దారుణం.దేవాదుల ప్రాజెక్టులో పది మోటార్లు ఉన్నా రేవంత్ సర్కారు తూతూమంత్రంగా ఒకటి, రెండు పంపులు మాత్రమే నడిపిస్తోంది.సగానికి పైగా మోటార్లను ఆన్ చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. నీళ్లు ఉండి కూడా రైతులకు అందించకపోవడం ద్రోహం కాదా?దేవాదుల నుంచి కిందికి వెళ్తున్న గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేయడం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే.ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు ఏం చేస్తున్నారు? రైతులకు నీళ్లు అందించే బాధ్యత గుర్తు లేదా? పదవులు ఉన్నవి అనుభవించడానికేనా లేక ప్రజలకు సేవ చేయడానికా?కేసీఆర్ గారు నిర్మించిన సీతారామ పంపుల ద్వారా గోదావరి జలాలు ఖమ్మం రైతుల పొలాలకు మళ్ళుతుంటె, దేవాదుల అన్ని పనులను ఆన్ చేకుండా ఎందుకు ద్రోహం చేస్తున్నారు?నల్లగొండ జిల్లాలో ప్రజలు సాగునీటి కోసం ధర్నాలు చేస్తున్నా, గోదావరి నీటిని ఎత్తిపోసి అందించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం.
నల్లగొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు, సొంత ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. సొంత గడ్డకే నీళ్లు ఇవ్వలేని మంత్రి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు?కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షతో వ్యవహరిస్తూ తెలంగాణ రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెట్టడం దారుణమైన చర్య.తెలంగాణకు జలద్రోహం చేస్తూ నీటిని ఎత్తిపోయకుండా, లక్షల క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేస్తూ, మరోవైపు అడ్డగోలు కూతలు కూయడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.కేసీఆర్ నిర్మించిన ఎత్తిపోతల వ్యవస్థను ఉపయోగించకుండా వదిలేయడం దుర్మార్గం.బీఆర్ఎస్‌పై రాజకీయంగా పోరాడండి. కానీ తెలంగాణ రైతులపై కక్ష తీర్చుకోవద్దు. రైతుల కడుపుమీద కొట్టే రాజకీయాలు మంచివి కావు.తెలంగాణను కరువుబారిన నెట్టి చంద్రబాబు రుణం తీర్చుకునే రాజకీయాలు మానుకోవాలి.కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషంతో తెలంగాణ రైతుల భవిష్యత్తును బలి చేయడం క్షమించరాని నేరం.తెలంగాణ భవిష్యత్తు తాగు, సాగు నీటి గోసకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.తెలంగాణ రైతుల శాపం నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకోలేదని హెచ్చరిస్తున్నాం.వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఎల్లంపల్లి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ సహా ఇతర అన్ని రిజర్వాయర్లను నింపాలని బి ఆర్ ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





