– టీజేఏసీ స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం
– స్వాగతించిన సంప్రదింపుల కమిటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో అమరుల స్మారక చిహ్నంలో జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియలో శనివారం చరిత్రాత్మక మైలురాయి నమోదైంది. పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియకు తామంతా సంపూర్ణ మద్దతు అందజేస్తామని టీజేఏసీ స్టీరింగ్ కమిటీ అగ్ర నాయకులు, వివిధ అనుబంధ జేఏసీల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కమిటీ చైర్మన్ కేకే, సభ్యుల ముందు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఉద్యమ కాలంలో యావత్ తెలంగాణను ఏకతాటిపైకి తెచ్చిన టీజేఏసీకి చెందిన ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కమిటీ ముందు అధిక సంఖ్యలో హాజరయ్యారు. టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ తమ అమూల్యమైన సలహాలు, సూచనలను కమిటీకి రాతపూర్వకంగా అందించారు. ఉద్యమ కాలం నాటి ఉమ్మడి స్టీరింగ్ కమిటీ డైరెక్టరీ ఆధారంగా వివిధ రంగాల నుండి ప్రతినిధులు హాజరై తమ ఐక్యతను చాటారు. టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుల ఈ అపూర్వమైన ఏకగ్రీవ మద్దతును కమిటీ చైర్మన్ డాక్టర్ కేశవరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోతె శోభన్ రెడ్డి, ఇతర ప్యానల్ సభ్యులు స్వాగతించారు. ఈ సంపూర్ణ సహకారం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న చివరి ఉద్యమకారుడిని కూడా ఎలాంటి తప్పులు లేకుండా గుర్తించడం సులువవుతుందని హర్షం వ్యక్తం చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా జరుగుతున్న డిజిటల్ స్క్రీనింగ్ ఆధారంగా అత్యంత పారదర్శకమైన తుది నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి అందిస్తామని కమిటీ చైర్మన్ చెప్పారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు: టీజీవో తరఫున వి.శ్రీనివాస్ గౌడ్, ఏలూరి శ్రీనివాసరావు; టీఎన్జీవో తరఫున కె.స్వామిగౌడ్, జి.దేవీప్రసాద్, కారం రవీందర్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.
కోర్ సెక్టార్ అండ్ రవాణా సంఘాలు: ఆర్టీసీ జేఏసీ తరఫున దొంతు ఆనందం, రాజిరెడ్డి, ఎలక్ట్రిసిటీ జేఏసీ నుండి కె. రఘు పాల్గొన్నారు.
వృత్తిపరమైన, సామాజిక జేఏసీలు: అడ్వకేట్ జేఏసీ నుండి ఎం.రాజేంద్ర రెడ్డి, ఎన్.ప్రహ్లాద్, డాక్టర్స్ జేఏసీ నుండి డాక్టర్ సురేష్ చంద్ర, ఇంజనీర్స్ జేఏసీ నుండి శ్రీధర్ దేశ్పాండే, టి.వెంకటేశం, ఎం.బాలనర్సయ్య.
సామాజిక, ఉపాధ్యాయ, సాంస్కృతిక సంఘాలు: తెలంగాణ మాల మహానాడు తరఫున టిఎమ్ఆర్ పిఎస్ నుండి బొట్ల భిక్షపతి, తెలంగాణ వికాస సమితి నుండి పిట్టల రవీందర్, ఉపాధ్యాయ సంఘాల నుండి ఎం.మణిపాల్ రెడ్డి (టీఆర్టీయూ), ఎంపీజే తరఫున హమీద్ మహ్మద్ ఖాన్, ప్రైవేట్ స్కూల్స్ జేఏసీ (టీఆర్ఎస్ఎంఏ) ప్రతినిధులు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు: నాటి ఉద్యమంలో కలిసి పనిచేసిన ప్రధాన రాజకీయ పక్షాల (టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ) నాటి స్టీరింగ్ కమిటీ మెంబర్లు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు.
ప్రధాన సూచనలు, డిమాండ్లు
సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు క్షేత్రస్థాయి ఉద్యమకారులకు తక్షణ న్యాయం చేకూర్చాలని కోరుతూ గత తీర్మానాలకు అనుగుణంగా తమ డిమాండ్లను కమిటీ ముందు ఉంచారు. పార్టీల హద్దులు దాటి ప్రతి నిజమైన పోరాట యోధునికి అధికారిక ప్రభుత్వ ప్రశంసా పత్రం మంజూరు చేయాలి. ఇండ్లు లేని నిరుపేద ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల నివాస స్థలాన్ని కేటాయించాలి. వృద్ధాప్య ఆసరా పెన్షన్లతోపాటు, ఉచిత కార్పొరేట్ వైద్య సదుపాయం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలి. ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





