– అందుకే విద్యా శాఖను నేనే నిర్వహిస్తున్నా
– స్కూల్స్‌లో మౌలిక వసతులకు రూ.1700 కోట్లతో ప్రణాళిక
– సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : యూనివర్సిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది..పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం తమ ప్రభుత్వ బాధ్యత.. రాష్ట్రంలోని తండాలు, గూడాలు, మారుమూల గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందించాలని విద్యా శాఖను తన దగ్గరే ఉంచుకుని అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్నొన్నారు. క్యూర్ ప్రాంతంలో రూ.1011 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాప చేశారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. 11 వేల ఉపాధ్యాయ నియామకాలను 60 రోజుల్లో చేశాం.. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం.. 36 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా చేశాం.. నీతి ఆయోగ్ విద్యా శాఖలో రాష్ట్రం సాధించిన విజయాలను అభినందించింది అని ఆయన వివరించారు. విద్యా శాఖ ఉద్యోగులు, టీచర్లను అభినందిస్తున్నానన్నారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షలమంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు.. 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.. ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.. 12 వేల ప్రైవేట్ స్కూల్స్ ఉంటే 38 లక్షల మంది చదువుతున్నారు.. ప్రైవేట్ స్కూల్స్‌లో ఉన్న గొప్పతనం ఏమిటి.. ప్రభుత్వ స్కూల్స్‌లో ఉన్న లోపం ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌లో 8 శాతం నిధులను విద్య కోసం కేటాయించాం.. వచ్చే యేడాది విద్యకు అధికంగా నిధులు ఇస్తాం.. 15 శాతానికి క్రమంగా పెంచుతాం.. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబట్టడమే లక్ష్యం.. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.. 25 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను విద్యా విధానం పరిశీలనకు ఫిన్లాండ్ దేశానికి పంపించాం.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి 500 మందిని విదేశాలకు పంపిస్తాం.. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించే టీచర్లను అభినందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున టీచర్లకు సన్మానం చేస్తామన్నారు. రాష్ట్రానికి నూతన విద్యా విధానాన్ని తీసుకువస్తున్నాం.. దేశానికి ఆదర్శంగా నూతన విద్యా విధానం ఉండాలన్నదే తమ ప్రయత్నం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రవేశపెడుతున్నాం.. పదో తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్‌లో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి.. పేద విద్యార్థులు ఆర్థాకలితో పాఠశాలలకు వస్తున్నారు.. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన భోజనం అందిస్తాం.. పాఠశాల విద్యార్థులకు పాలు, రాగి జావ అందిస్తాం.. కొడంగల్‌లో ఫైలెట్ ప్రాజెక్టుగా పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం.. ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ పిల్లలతో సమానం.. తల్లిదండ్రుల్లారా మా ప్రభుత్వం విద్యార్థులను జాగ్రత్తగా చూసుకుంటుంది.. 200 శాతం కాస్మెటిక్ చార్జీలు, 40 శాతం డైట్ ఛార్జీలు పెంచాం.. రేపటి తెలంగాణ ప్రభుత్వ పాఠశాల గదుల్లోనే ఉందని మేం భావిస్తున్నాం.. విద్యా శాఖపైన పెట్టే ఖర్చును భవిష్యత్తు తరాల పెట్టుబడిగా భావిస్తున్నాం.. యూనివర్సిటీల్లో సదుపాయాల కల్పన వందలాది కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం..100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ ను రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. తెలంగాణలోని పేదల బిడ్డలు ధైర్యంగా గుండెపైన చేయి వేసుకుని యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్‌లో చదువుకున్న అని చెప్పాలన్నదే నా ధ్యేయం.. మేం అంతా ప్రభుత్వ స్కూల్స్‌లో చదువుకున్నాం.. ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కాదు.. అభివృద్ధి వేదికలు.. కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తాం.. పాఠశాలలు టీచర్లు, ఐఎఎస్‌లు, రాజకీయ నాయకుల కోసం కాదు.. పేదల విద్యార్థుల కోసం, పేదలకు మేలు జరిగే ఏ నిర్ణయమైనా వెనకడుగు వేయకుండా తీసుకుంటాం అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇచ్చే ఎడ్యుకేషన్ కిట్ నాణ్యతను తానే స్వయంగా పరిశీలించానన్నారు. పుస్తకాలు, నోట్ పుస్తకాలు సరైన సమయంలో విద్యార్థులకు చేరాలి.. పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఒక జత స్కూల్ డ్రెస్‌ను అందజేస్తున్నాం.. మరో జత నెలాఖారున ఇస్తాం.. ఎడ్యుకేషన్ కిట్ కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నాణ్యమైన వస్తువులు రాకపోతే తక్షణమే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలి.. నాణ్యత లేని వస్తువులను సప్లై చేసే కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టి బొక్కలో తోయించే బాధ్యత నాది.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూటికి నూరు శాతం మార్కులు రావాలన్నదే నా కల.. టీచర్లకు మొదటి తేదీన జీతంతోపాటు మౌలిక సదుపాయలు కల్పించే బాధ్యత నాది.. ప్రభుత్వ టీచర్లకు ఉద్యోగం కాదు భావ్వోదేగం.. బరువు కాదు బాధ్యత.. అని అన్నారు. 19 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల భవిష్యత్తు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేతిలో ఉంది.. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పనిచేయాలి.. తెలంగాణ విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా నిలబడేలా ముందుకు సాగుదాం. విద్యా శాఖ కు మంత్రి లేడని కొండరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు.. సమీక్ష సమయంలో తనను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యా శాఖ మంత్రిగా చూడండి.. కావాలనే విద్యా శాఖను నా దగ్గర పెట్టుకున్నాను.. మంచి విద్యను అందించి బాధ్యత కల్గిన పౌరులను దేశానికి అందించాలన్నదే నా ఉద్దేశం.. త్వరలోనే విద్యా శాఖలో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





