కొత్త ఆలోచనలకు వేదికలు కావాలి

గత రెండేళ్లుగా తెలుగు సమాజంలో సాహిత్యోత్సవాల సందడి పెరగడం వొక ఆశావహమైన పరిణామం. సాహిత్యం పుస్తకాలకూ, సాహిత్య సమావేశాలకూ పరిమితం కాకుండా విస్తృతమైన సామాజిక సంభాషణగా మారడానికి యీ వుత్సవాలు దోహదపడతాయని భావిస్తున్నాను. ముఖ్యంగా రచయితలకూ, పాఠకులకూ మధ్య ప్రత్యక్షమైన సంభాషణకు, భిన్నతరాల సాహిత్య దృక్పథాల మధ్య చర్చకు యివి అవకాశాలు కల్పిస్తాయి. సమకాలీన సమాజంలో చోటుచేసుకుంటున్న సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలనూ, మారుతున్న మానవ సంబంధాలనూ, కొత్త అస్తిత్వాలనూ సాహిత్యం యెలా ప్రతిబింబిస్తోందో చర్చించుకోవడానికి యివి వేదికలు కావాలి. అలా అవుతున్నాయి కూడా. అయితే సాహిత్యోత్సవాల విజయాన్ని హాజరైన జనసంఖ్యతోనో, నిర్వహణ వైభవంతోనో మాత్రమే కొలవలేం. అవి యెన్ని కొత్తప్రశ్నలను ముందుకు తెచ్చాయి, యెంతమంది కొత్త పాఠకులను సాహిత్యానికి దగ్గర చేశాయి, యెన్ని భిన్నమైన గొంతుకలకు ప్రాతినిధ్యం కల్పించాయి అన్నదే ముఖ్యం. సాహిత్యోత్సవాలు కేవలం వేడుకలుగా మిగిలిపోకుండా సమాజంలో సాహిత్య చైతన్యాన్ని విస్తరించే సృజనాత్మక సాంస్కృతిక వేదికలుగా రూపొందాలని ఆశిస్తున్నాను.

ఛాయ సాహిత్యోత్సవానికి గత యేడాది నుంచి యీ యేడాది వరకూ క్యూరేటర్‌గా భాగస్వామిని కావడం నాకు వొక సృజనాత్మక బాధ్యత. సాహిత్యాన్ని కేవలం రచయితల ప్రపంచంగా కాకుండా సమాజంలోని విభిన్న అనుభవాలనూ, ఆలోచనలనూ, జీవన వాస్తవికతలనూ పంచుకునే ప్రజాస్వామిక వేదికగా చూడాలన్నది నా దృక్పథం. ఛాయ సాహిత్యోత్సవం కూడా ఆ దిశగా విస్తరించాలని మా టీమ్ ఆశిస్తూ… ముఖ్యంగా స్త్రీలరచనలు, యువతరం సృజనాత్మక వ్యక్తీకరణలు, అస్తిత్వ సాహిత్యం, సమకాలీన సామాజిక పరిణామాలు, మారుతున్న మానవ సంబంధాలు, సాహిత్యంలో కొత్తధోరణులు చర్చకు రావాలని విభిన్న భావజాలాల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణ జరగాలన్న ఆకాంక్ష ఛాయ లిటరేచర్ ఫెస్టివల్ టీం కి వుంది. అందుకే అన్నిరకాల స్వరాలని వినాలని… వినిపించాలని… కొత్త రచయితలకూ, యువ పాఠకులకూ యీ వేదికలో భాగస్వామ్యం పెరగాలని పోయిన యేడాది వొక్కరోజు నిర్వహించిన ఫెస్టివల్‌ని యీ సారి రెండురోజులు చేస్తూ దక్షిణాది రచయితలతో పాటు… సాహిత్యం మనకు తెలిసిన జీవితాన్నే తిరిగి చెప్పడం కాదని మా యెరుక. యీ యేడాది తమిళం‌ను గెస్ట్ లాంగ్వేజ్ గా ఆహ్వానించాం. యికమీదట ప్రతియేడాది వొకభాషను యిలా అతిథిభాషగా ఆహ్వానించాలని అనుకున్నాం. తమిళం నుండి జయమోహన్, సల్మా, చారు నివేదిత లాంటి రచయితలతో పాటూ కన్నన్ సుందరం, ఆనంద్ దక్షిణామూర్తి లాంటి ప్రచురణకర్తలు, రోహిణి, లీనా మనిమేఖలై లాంటి ఫిల్మ్ పర్శనాలిటీలు కూడా వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *