* కె.సి.ఆర్.కనుసన్నల్లోనే జరిగింది
* బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్
* బీజేపీ ఎంపి ఈటల రాజేందర్ ఆరోపణ
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్24: దమ్ము, ధైర్యం లేక తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఎంపి ఈటల రాజేందర్ మండిపడ్డారు. బిఆర్‌ఎస్ హయాంలో తమ ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల రాష్ట్రంలో భాజపా చాలా చోట్ల ఓడిపోయిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు నత్తనడకన సాగుతోందని, బీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వేగం లేదని అన్నారు. ప్రభాకర్ రావు నిబంధనలు అతిక్రమించి మాజీ సిఎం కెసిఆర్ కోసం పని చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా కాల్ డేటాలో చూపించారు. హుజూరాబాద్‌లో, 2023లో గజ్వేల్‌లో పోటీ చేసినప్పుడు దుర్మార్గమైన పద్ధతిలో నా ఫోన్ ట్యాప్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు మేం.. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నామనేది ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడతారని మండిపడ్డారు. ప్రభాకర్‌రావు ఐపీఎస్ అధికారి కాదు. అయినా, ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారు. విశ్రాంత అధికారిని అక్రమంగా నియమించారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. ఫోన్లు ట్యాప్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. జడ్జిలు, మంత్రులు, పార్టీ ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ మొత్తం కేసీఆర్ వద్దే ఉండేది. కాళేశ్వరంపై కమిటీ నివేదికను ఇంకా బయటపెట్టలేదు. పోన్ ట్యాపింగ్‌పై విచారణ కమిషన్ వేసి ఏడాదిన్నర కావొస్తుంది. భారాస, కాంగ్రెస్ లాలూచీపడకపోతే విచారణ నివేదికలు ఎందుకు భయటపెట్టడంలేదో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తన రెండు ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ అధికారులు చెప్పారని భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజకీయ పార్టీ నేతలు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్ కాల్స్ వినడం దారుణమన్నారు. ‘బీజేపీను దెబ్బతీయడానికే ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ, కొద్ది మందిని మాత్రమే సాక్షులుగా పిలుస్తున్నారు. దేశ రక్షణ, భద్రత కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్‌ను రాజకీయం కోసం వాడుకున్నారు. ఈ కేసులో అసలైన దోషులు తెలియాలంటే సీబీఐతో విచారణ చేయించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడే అవకాశం ఉందన్నారు.