ఇది గోల్డెన్ పీరియడ్

*రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ హ‌ర్షం
* క్షేత్ర‌స్థాయి వ‌ర‌కు పార్టీ బ‌లోపేతం
* రైతు భ‌రోసా చెల్లించాం
* మూడునెల‌ల్లోనే రూ.2ల‌క్ష‌ల రైతుల రుణ‌మాఫీ
* ఎప్ప‌టిక‌ప్పుడు ఉచిత విద్యుత్ బ‌కాయిల చెల్లింపు
* మీడియా స‌మావేశంలో ఉప‌ ముఖ్య‌మంత్రి భ‌ట్టి 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24:  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ, కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం నరకాలంగా తీసుకున్న నిర్ణయాలపై రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. గోల్డెన్ పీరియడ్ అని అభినందించింది.  బూత్ , మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ కార్యాచరణ రూపొందించాలని తీర్మానించింద‌ని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఆయ‌న సోమ‌వారం గాంధీభ‌వ‌న్లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశం ప్ర‌సంగించారు.  ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి, కిందిస్థాయి వరకు తీసుకు వెళ్ళేందుకు ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని పీఏసీ నిర్ణయించింద‌న్నారు.  ఎన్నికల ముందు వారు ఒక సీజన్ కు రైతు భరోసా ఎగవేస్తే త‌మ ప్ర‌భుత్వం చెల్లించింద‌న్నారు. పదేళ్లు అధికారంలో ఉండి, బీసీలకు మేలు జరిగే సర్వేలో పాల్గొనని వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీల కుల సర్వే గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమేన‌న్నారు. ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకువచ్చేందుకు బీసీల కుల గణన పై మొదట క్యాబినెట్లో తీర్మానం చేశాం. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం చేయించాం. ఆ తర్వాత గవర్నర్ కు పంపాము. ఇది బీసీల కుల గణన పై మా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అన్నారు.  అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, రైతన్నలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు సరఫరా, పెట్టుబడి సాయం కింద రైతు భరోసా, సన్నాలు సాగు చేసిన రైతులకు రూ.500 బోనస్, రైతు బీమా, పంట నష్టం జరిగితే పరిహారం,భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ  భరోసా, రైతన్నల  కోసం దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు  గురించి పీఏసీ అభినందించింద‌న్నారు. ఈ వానాకాలం సీజన్లో పంటలకు పెట్టుబడి సాయం కింద రైతన్నలు నాట్లు వేసే ముందే తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా నిధులు జమ చేసామ‌న్నారు.  అన్నదాతల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్తు పథకం కింద నెలకు రూ.900 కోట్ల చొప్పున అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రూ.17,091 వేల కోట్లు రైతుల పక్షాన ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింద‌న్నారు. ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్రంలోని 29.40 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. రైతు భరోసా పథకం కింద నేటి వరకు 69.70  లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21,763 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం జమ చేసింది.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇచ్చిన మాట మేరకు 2లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలోని 25.36 లక్షల మంది రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం 21,763 కోట్లు  బ్యాంకులకు చెల్లించింద‌న్నారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ రూపంలో ఈరోజు వరకు రూ.1,199 కోట్లు రైతులకు ప్రజా ప్రభుత్వం చెల్లించింద‌న్నారు. రైతు బీమా పథకాన్ని అమలు అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద 42.16 లక్షల మంది రైతుల పక్షాన ఇన్సూరెన్స్ సంస్థలకు నేటి వరకు రూ.2,181 కోట్లు చెల్లించాం. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న మేం ధర్నాలు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అకాల వర్షాలు, వడగండ్లు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే అన్నదాతకు అండగా నిలవాలన్న ఆలోచనతో మనసున్న ప్రభుత్వం ఇప్పటివరకు పంట నష్టపరిహారం కింద 260 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామ‌న్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పంట నష్టం అందించడం కాదు కదా సర్వే కూడా చేయలేదన్నారు. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నేటి వరకు 50 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామ‌న్నారు. ఇందిరా గిరి వికాసం పథకం కింద 2.1 లక్షల గిరిజన రైతులకు సోలార్ విద్యుత్ తో నడిచే సాగునీటి పంపుసెట్లు, స్ప్రింక్లర్లు , డ్రిప్‌, ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు పామాయిల్ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నాం. ఇందుకుగాను 12,600 కోట్లు ఖర్చు కేటాయించాము. అడవుల్లో పెద్ద  నిర్మాణాలు, విద్యుత్ లైన్లు అవసరం లేకుండా గిరిజన రైతులకు సాగునీరు అందించాలనేదే మన ప్రభుత్వం లక్ష్యమ‌న్నారు. పూర్తిగా రైతన్నల కోసం చేపట్టిన కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం రైతుల కోసం 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, ఐదు సంవత్సరాల కాలంలో రైతుల కోసం మూడున్నర లక్షల కోట్లు  ఖర్చు చేసి తీరుతామ‌న్నారు.  నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామ‌న్నారు. ప్రతి పాఠశాల 25 ఎకరాల్లో రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామ‌న్నారు. మొదటి సంవత్సరం 58 పాఠశాలలు నిర్మించేందుకు రూ.11,600 కోట్లు కేటాయించిన‌ట్టు తెలిపారు.గత పాలకులు 10 సంవత్సరాలు నిరుపేద విద్యార్థుల భోజనం గురించి ఆలోచన చేయలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న 7.66 లక్షల మంది విద్యార్థుల సంక్షేమ ని దృష్టిలో పెట్టుకొని డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచామ‌న్నారు. కోటి మంది మహిళలను ఐదు సంవత్సరాలలో కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం. మొదటి సంవత్సరం లక్ష్యాన్ని మించి రూ.21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాం.కొలువుల కోసం మన యువకులు కోరి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. వారి కలలు నిజం చేసేందుకు ఇప్పటికే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేసామ‌న్నారు.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పేరిట తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అర్హులైన యువత సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు నాలుగు లక్షల వరకు నగదు సహాయం అందిస్తున్నామ‌న్నారు.రాష్ట్రంలోని 3.10 కోట్ల మంది పేదలకు ఉగాది నుంచి సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఇందుకుగాను ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.13,525 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 188 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. ఆడబిడ్డల పక్షాన ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థకు ఇప్పటివరకు రూ. 4,310 కోట్లు చెల్లించింద‌న్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన 580 కోట్లు ఇప్పటికే చెల్లించింద‌న్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 50.77 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయ‌న్నారు. వారి పక్షాన ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.2,050 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింద‌ని గుర్తుచేశారు. రూ. 22,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసంగా 3,500 చొప్పున మొత్తం రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మిస్తున్నామ‌న్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు వరకు పెంచామ‌న్నారు. దీన‌వల్ల రాష్ట్రంలో  90 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరిందద‌న్నారు. ఇప్పుడు ఉన్న చికిత్సలే కాక అదనంగా మరో 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వచ్చాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేటి వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,367 కోట్లు ఖర్చు చేసింద‌న్నారు. చేయూత పథకం కింద  నేటి వరకు రూ.17,563 వేలకోట్లు ఖ‌ర్చు చేయగా 43.01 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందారన్నారు. నెల మొదటి తేదీనే చేయూత కింద పెన్షన్లు పంపిణీ చేస్తున్నామ‌న్నారు. విలేకరుల సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page