– తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ భవనాలను హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఎన్ని ఉన్నాయి, శిథిలావస్థ, పాలనకు అనువుగా లేని భవనాలు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను సేకరించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదని, ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. మొదటి దశలో అద్దె భవనాల్లో, శిథిలావస్థలో ఉన్న 125 తహసీల్దార్ కార్యాలయాలు, 11 ఆర్డీవో కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే అవసరమైనచోట్ల మరమ్మతులు చేపట్టడానికి నివేదికలు అందించాలని రెవెన్యూ సెక్రటరీని ఆదేశించారు. ఇందుకు అవసరమైన స్థలాలను తక్షణమే గుర్తించి నిర్మాణ పనులు వీలైనంత త్వరితగతిన ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందేలా ఈ భవనాల నిర్మాణం ఉంటుందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత కూడా రెవెన్యూ కార్యాలయాలు ప్రజలకు సౌకర్యవంతంగా లేకపోవడంతోపాటు చాలావరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా, ప్రణాళిక లేకుండా మండలాల పునర్విభజన చేపట్టిందని, కొన్ని మండలాలు రెండుమూడు జిల్లాల పరిధిలోకి వస్తున్నాయని మంత్రి విమర్శించారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశామని తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో అత్యాధునిక వసతులతో ఇప్పటికే సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజిగిరి, పటాన్‌చెరు, కోహెడలలో భవనాలకు శంకుస్థాపన జరిపి పనులు కూడా ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సంఖ్యకు అనుగుణంగా భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. రెండు డీిఐజి, నాలుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్, 52 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు వేల చదరపు అడుగుల నుంచి పది వేల చదరపు అడుగులు ఉండేలా ఒకే నమూనాలో నిర్మించబోతున్నామన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని, త్వరలోనే దాని పరిధిలోని కలెక్టర్లతో సమావేశం నిర్వహించబోతున్నామని వెల్లడించారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐ.జి రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ సెక్రటరీ వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





