– గురుకులాల్లో రూ. 2000 కోట్ల కుంభకోణం వాస్తవం
– రైతులకు బాకీ పడ్డ రూ. 19,000 కోట్లు విడుదల చేయాలి
– రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఉరి
– ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు ఆగమాగం
– ‘సర్’ ప్రక్రియలో ఓట్లు గల్లంతు కాకుండా చూడాలి
– అల్గనూరు బీఆర్ఎస్ సమావేశంలో హరీష్‌రావు
– రైతులకు బాకీ పడ్డ రూ. 19,000 కోట్లు విడుదల చేయాలి
– రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఉరి
– ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు ఆగమాగం
– ‘సర్’ ప్రక్రియలో ఓట్లు గల్లంతు కాకుండా చూడాలి
– అల్గనూరు బీఆర్ఎస్ సమావేశంలో హరీష్‌రావు
కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 16: రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు,. అన్నీ స్కాములేనని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. . గురుకులాల్లో 2000 కోట్ల స్కామ్ జరిగిందని నేను వాస్తవాలు మాట్లాడితే మంత్రులు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ ఛాలెంజ్ చేస్తున్నారు. బట్టలు, బూట్లకు 1200 కోట్లు, ఉప్పులు పప్పులు కోడిగుడ్లకు 800 కోట్లతో టెండర్లు పిలిచిన విషయమే సంబంధిత మంత్రులకు తెలవకపోతే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అనుముల వారి అన్నదమ్ములే ఈ టెండర్లన్నీ మింగుతున్నారు. కోటిమంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నాడు కానీ నలుగురు అన్నదమ్ములు మాత్రమే కోటీశ్వరులు అయ్యారన్నారు. మానకొండూరు నియోజకవర్గం అల్గనూర్ లో మంగళవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మానకొండూర్ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో ఎంత అద్భుతంగా పోరాడారో నాకు తెలుసు. 2001లో పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిచిన కరుడుగట్టిన కార్యకర్తలున్న గొప్ప నియోజకవర్గం ఇది. అధికారంలో ఉన్నా లేకపోయినా బ్రహ్మాండమైన బలగం ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. మన కార్యకర్తల మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారన్నారు. దేవేందర్, వేణు, రసమయి, సోషల్ మీడియా తమ్ముళ్లు సతీష్, సది.. ఇలా అందరి మీద పదేళ్ల కిందటి కేసులు తీసి ఇబ్బంది పెడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నవాడు మాత్రమే కేసులు పెడతాడు. వాళ్లు ఎన్ని కేసులు పెడితే మన గెలుపు అంత దగ్గరికి వస్తున్నట్టు లెక్క అన్నారు. రేవంత్ రెడ్డి పతారా ఖతమైపోయింది. మొన్న వర్షాలు పడి ట్రాఫిక్ జామ్ అయితే నేను చెప్పినా ఏ ఆఫీసర్ వింటలేడు అని ముఖ్యమంత్రే స్వయంగా అన్నాడు. నీ పని అయిపోయిందని, నువ్వు ఉండేది లేదని అధికారులకు అర్థమైంది కాబట్టే నీ మాట వినడం లేదు. ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12000లు ఇస్తామని మూడు బడ్జెట్లలో చదివారు. ఏ ఒక్క కూలీకి అయినా ఒక్క రూపాయి వచ్చిందా? ఖజానా ఖాళీ అంటాడు కానీ ఫ్యూచర్ సిటీలో 100 కోట్లతో, ఎంసీహెచ్ఆర్డీలో మరో 100 కోట్లతో క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి, సచివాలయంలో వాస్తు మార్పులకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మెస్సీ ఫుట్బాల్ షోకులకు, మూసీ సుందరీకరణకు, ఇతర రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఎన్నికలకు ఫుల్ పేజీ యాడ్లు ఇవ్వడానికి, ఢిల్లీకి మూటలు పంపడానికి మాత్రం వందల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి? దేవుని మీద ఒట్టుపెట్టి ఆగస్టు కల్లా రుణ మాఫీ చేస్తా అని దేవున్నే మోసం చేసిండన్నారు. 100 రోజుల్లో 4000 పెన్షన్, 2500 మహాలక్ష్మి ఎగబెట్టిండు. ఇవన్నీ ఎగ్గొట్టిన వాడిని ఎగవేతల రేవంత్ రెడ్డి అనక ఏమనాలి? ఈ మాట అన్నందుకే మానకొండూరు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టి నోటీసులు పంపారన్నారు. మృగశిర కార్తె వచ్చినా కళ్లాల్లో వడ్లు కొంటలేరు, బస్తాలకు చెదలు పడుతున్నాయి. ఏడ పోయినా 5 కిలోల తరుగు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏకంగా మూడు రైతు బంధులు ఎగబెట్టిండు. ఒకసారి పూర్తిగా ఎగబెట్టి 9000 కోట్లు, తర్వాత మూడు ఎకరాలకు ఇచ్చి 4000 కోట్లు, ఇప్పుడు రెండు ఎకరాలకు ఇచ్చి 6000 కోట్లు.. మొత్తం 19వేల కోట్ల రైతు బంధు బాకీ పడ్డాడు. ఈ బాకీ వెంటనే విడుదల చేయాలని మానకొండూరు గడ్డ మీద నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎరువులకు యాప్ పెట్టి పోలీస్ స్టేషన్లలో లైన్లు కట్టే పరిస్థితి తెచ్చారు. రైతు బీమాకు ఎల్ఐసీకి పైసలు కట్టక అది కూడా నాలుగు నెలలుగా బంద్ అయిపోయింది. పోయిన యాసంగి, ఈ యాసంగి కలిపి 2100 కోట్ల బోనస్ ఎగ్గొట్టి బోనస్ ను బోగస్ చేశారు. 24 గంటల కరెంటు పోయి ఇప్పుడు 9 గంటలకు వచ్చింది. ఇప్పుడు రైతు డిస్కమ్ అనే కొత్త భూతం తేబోతున్నారు. ఇది వస్తే పొద్దున ఎండ ఉన్నప్పుడు 7-8 గంటలు మాత్రమే పవర్ ఇస్తారు. కాంగ్రెస్ నాయకులు ఈఆర్సీ ముందు 3 గంటల కరెంట్ చాలు అంటున్నారు. ఈ రైతు డిస్కమ్ అమల్లోకి వచ్చిందంటే ఉచిత కరెంటుకు ఉరివేసినట్టేనన్నారు. ఫీజ్ రీయంబర్స్మెంట్ ఇయ్యక 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తున్నాడు. ఫీజులు రాక డిగ్రీలు, పీజీలు అయిపోయినా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. 10-15% కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు మాత్రం కోట్లు బిల్లులు ఇస్తున్నాడు. ఎలక్షన్ల ముందు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు. బయట సభల్లో 68 వేలు ఇచ్చాం అని అబద్ధాలు చెప్తూ అసెంబ్లీలో మాత్రం 16,000 మాత్రమే ఇచ్చామని స్వయంగా ముఖ్యమంత్రే ఒప్పుకున్నాడని గుర్తు చేశారు. కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 5,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తా అంటున్నాడు. నిరుద్యోగులు దిల్ సుఖ్ నగర్, చిక్కడపల్లిలో ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ఒకేసారి 17,000 పోలీసు ఉద్యోగాలను నింపారు. ఎలక్షన్ల ముందు ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు ఫ్రీ అన్నాడు, అధికారంలోకి రాగానే 400 ఉన్న ఫీజును 800 చేసిడు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడంతో మానకొండూర్, అల్గనూర్, తిమ్మాపూర్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. ప్లాటు అమ్ముకుందామన్నా కొనే దిక్కు లేదు. ఆర్టీఏ చార్జీలు పెంచిండు. మోటార్ సైకిల్ కు 5000, పెద్ద బండికి 10,000, కారుకు 20,000 పెంచిండు. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అని చెప్పి మగోళ్లకు డబుల్ టికెట్ రేట్లు పెంచిండు. బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదేళ్లలో కొత్తగా 23 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం, మిడ్ మానేరును పూర్తి చేసి ముంపు బాధితులకు పరిహారం ఇచ్చాం. రేవంత్ రెడ్డి ఈ రెండున్నర ఏళ్లలో కనీసం రెండు ఎకరాలకైనా నీళ్లు ఇచ్చిండా? అని డిమాండ్ చేస్తున్నాను.
బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాల
ఓటర్ల సవరణ ప్రక్రియ ‘సర్’ ఈ నెల 25నుంచి ప్రారంభం కాబోతోంది. గతంలో 2002లో ఈ ప్రోగ్రాం జరిగింది కాబట్టి 2002లో మీకు ఓటు హక్కు ఉందా లేదా అన్నది ప్రధానంగా చూసి ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తారు. అప్పటికే కుటుంబంలో ఓటు ఉంటే మళ్లీ ఎలాంటి సర్టిఫికెట్లు, కాగితాలు అడగరు. జూన్ 25 నుంచి జూలై 25 వరకు అధికారుల బృందం డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తుంది. గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, పట్టణాల్లో ఆర్‌పీలు బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఉంటారు. మండల స్థాయిలో ఎంఆర్ఓ, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రోగ్రాంకు ఇంచార్జీలుగా వ్యవహరిస్తారు. సర్వేలో భాగంగా ఇంటింటికి వచ్చి రెండు పేపర్లు ఇస్తారు. ఆ ఫారమ్ నింపి ఒకటి వాళ్లకు ఇచ్చి, ఇంకొకటి ‘రిసీవ్డ్ కాపీ’ కింద వాళ్ల సంతకం తీసుకొని ఆధారంగా మన దగ్గర భద్రంగా పెట్టుకోవాలి. ఒకవేళ 2002లో ఓటు లేకపోయినా, ఫ్యామిలీ గ్రూపింగ్ లో పేరు లేకపోయినా ఎస్ఎస్సీ సర్టిఫికెట్, పాస్పోర్ట్, కరెంటు బిల్లు లాంటి 10 రకాల ఆధారాల్లో ఏదైనా ఒకటి చూపిస్తే ఓటు నమోదు చేస్తారు. చదువు, ఉద్యోగాల కోసం దుబాయ్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, బంధువులు రావాల్సిన అవసరం లేకుండానే వారి వివరాలు అందించి ఓటు నమోదు చేయవచ్చు. ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు ఇందులో అధికారికంగా భాగస్వామ్యం కల్పించింది. కాబట్టి మన పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు బీఎల్ఓల వెంట వెళ్లి ఓటర్లకు సహకరించాలి. ఓటర్లకు ఫామ్ నింపడం రాకపోతే లేదా చదువుకోకపోతే, పార్టీ ఏజెంట్లే స్వయంగా ఆ ఫారమ్స్ నింపి అధికారులకు అందజేయాలి. జూలై ఆఖరులో ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ వస్తుంది, ఆ తర్వాత అభ్యంతరాలు తెలపడానికి అవకాశం ఇస్తారు. ఒకవేళ తుది జాబితాలో ఓటు గల్లంతైతే కలెక్టర్ కు గానీ, రాష్ట్ర ఎన్నికల అధికారికి గానీ, అవసరమైతే హైకోర్టుకు గానీ వెళ్లి ఓటు హక్కు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లందరూ అత్యంత క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





