రాష్ట్ర‌ అభివృద్ధిపై ఎవ‌రి పాఠాలు అవసరం లేదు

– తెలంగాణ, హైదరాబాద్‌ అభివృద్ధి పట్ల మా చిత్తశుద్ధి మాకుంది
– హైదరాబాద్‌ ‌మెట్రోకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం
– తాము అడ్డుకుంటే ప్రాజెక్టులు ఎక్కడా ఆగవు
– అన్ని విధాలుగా అనేక  కార్యక్రమాలు చేపట్టాం
– రేవంత్‌ ‌వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కిషన్‌ ‌రెడ్డి

న్యూదిల్లీ, జూన్‌ 16: ‌తెలంగాణ అభివృద్ధిపై తమకెవరూ పాఠాలు చెప్పాల్సిన పనిలేదని, ఎవరి కోసమో తాము అభివృద్ధికి పాటుపడడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. మెట్రోప్రాజెక్టు విషయంలో తన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నిరోజులుగా అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిప‌డ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి విమర్శల నేపథ్యంలో దిల్లీలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడేళ్లుగా కేంద్ర సహాయ మంత్రిగా, కేబినెట్ మంత్రిగా తాను తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేశానని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలనే కోరుకున్నాను తప్ప ఏనాడూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫేజ్-2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించిందని, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తనతో, ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని తెలియజేశారన్నారు. దేశవ్యాప్తంగా మిగతా మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరిగానే హైదరాబాద్‌ ‌మెట్రోకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందనన్నారు. సాంకేతిక, ఆర్థిక విషయాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ప్రాజెక్టులు సాకారమవుతాయన్నారు. తాను వద్దంటే ప్రాజెక్టులు ఎక్కడా ఆగవని చెప్పారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి అనేక మార్పులను కేంద్రం రాష్ట్రానికి సూచించిందన్నారు. ప్రాజెక్టులను దొడ్డిదారిన ఆపే సంస్కృతి బీజేపీకి లేదని, కాంగ్రెస్‌కే ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఎవరి కోసమూ ప్రాజెక్టులను అడ్డుకోబోమన్నారు. గతంలో మెట్రో ఫేజ్‌-1‌కు కేంద్రం రూ.1,250 కోట్లు మంజూరు చేసింది. అనాలోచితంగా, దుందుడుకు ధోరణిలో సీఎం మాట్లాడటం సమంజసం కాదు. తనతోపాటు ప్రధాని మోదీ, కేంద్రానికి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌సర్టిఫికెట్‌ అవసరం లేదు. మేం రేవంత్‌రెడ్డికి కాదు.. తెలంగాణ ప్రజలకు జవాబుదారీ. రాష్ట్ర అభివృద్ధి కోసం 12 ఏళ్లుగా పనిచేశాం.. ఇప్పుడూ పనిచేస్తాం. ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నాం. తెలంగాణ, హైదరాబాద్‌ అభివృద్ధి పట్ల మాకెవరూ పాఠాలు చెప్పనక్కర్లేదన్నారు. తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశాను. దిల్లీకి వచ్చి రెండుసార్లు ధర్నా చేశాం. బిల్లు ఆమోదం పొందిన తర్వాతే ఏపీ భవన్‌లో ఆమరణ దీక్ష విరమించా.  రైల్వేస్టేషన్ల అభివృద్ధి కోసం నాడు కేసీఆర్‌, ‌నేడు రేవంత్‌రెడ్డికి లేఖలు రాశా. రేవంత్‌ ‌కోరిరనందుకు కాకుండా కేంద్ర ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు చేపట్టింది. ఎంఎంటీఎస్‌ ‌ఫేజ్‌-2‌కు నాడు కేసీఆర్‌ ‌సహకరించలేదు. అయినప్పటికీ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాం. తెలంగాణకు రాదనుకున్న రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీని సాధించాం. రాష్ట్రాల్లో ఏ పార్టీకి చెందిన ప్రభుత్వాలు ఉన్నా అందరికీ కేంద్రం సహకారం అందిస్తోంది. మోదీ ఇస్తుంటే కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారనడం దిగజారుడు రాజకీయాలని మండిపడ్డారు. 50 ఏళ్లు వడ్డీ లేకుండా రాష్ట్రానికి ఇటీవ‌వ‌ల సాస్కీ రుణాలను కేంద్రం మంజూరు చేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఏడీబీ రుణానికి కేంద్రం ఎన్వోసీ ఇచ్చింది. ఎన్‌సీడీసీ ద్వారా పదేళ్లుగా రూ.లక్ష కోట్లు మంజూరు చేశాం. ధాన్యం కొనుగోళ్లకు రూ.37వేల కోట్లు మంజూరు చేసి ఇప్పటికే రూ.34వేల కోట్లు అందించాం అని కిషన్‌రెడ్డి వివరించారు. మెట్రో అంశంలో బీజేపీపై బురదజల్లుతున్నారంటూ సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై మండిపడ్డారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ ఆపాలని తానెందుకు చెబుతానంటూ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రూ.లక్షా 75 వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నాం.. రాష్ట్ర అభివృద్ధి మా బాధ్యత’ అని కిషన్‌ ‌రెడ్డి పునరుద్ఘాటించారు. తనపై రేవంత్‌ ‌తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఆయ‌న‌ సర్టిఫికెట్‌ అవసరం లేదన్నారు. అభివృద్ధి అంశంలో తమకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ ‌నేతలకు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *