“లక్షల సంఖ్యలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాలీల లెక్కలు ప్రభుత్వం దృష్టిలో లేవనుకోలేము. జిల్లా విధ్యాధికారి పోస్ట్ నుండి ఆఫీస్ సబార్డినేట్ సిబ్బంది వరకు ఉన్న ఖాలీల సంఖ్య ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. వందల పాఠశాలల్లో గంట కొట్టేందుకు ఆఫీస్ సబార్డినేట్లు, ఆఫీస్ పనులకు గుమస్తా సిబ్బంది లేరు. వెయ్యి మంది ,ఆపై ఎక్కువ విద్యార్థుల నమోదు శాతం కలిగిన ఉన్నత పాఠశాలల్లో సైతం బడి గంట కొట్టేందుకు కనీసం తాత్కాలిక సిబ్బంది కూడా లేకపోవడం విచారకరం..”

మొబైల్ : 9951624126
ప్రభుత్వ విద్య అభివృద్ధి పై కాంగ్రెస్ సర్కారు కురిపిస్తున్న అభిమానంలో నిజాయితీ ఉందనే భ్రమలలోంచి తెలంగాణ సమాజం తేరుకోవాలి. ఆలోచనలో కపట ప్రేమ, అమలు చేసే పథకాల డొల్లతనం, ఆచరణలో వైఫల్యాలు, పాఠశాల నిర్వహణలో లోపాలను గమనించాలి. బడిబాట నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోలేక పోవటానికి గల వాస్తవ కారణాలను ఆవగతం చేసుకోవాలి. మండుటెండలలో బడిబాట నిర్వహించినా కూడా నమోదు శాతం లక్ష్యాన్ని ఎంతో కొంతైనా కూడా అధిగమించలేక పోతున్నాం. ఇప్పటికే ఉన్న నమోదును కాపాడుకోలేక పోతున్నాం. పాఠశాల విద్య నిర్వహణ మార్గదర్శకాలను ప్రభుత్వం నిర్ధేశించాలి.అధికారులు అమలు చేయాలి. కానీ అధికారులే విద్యా నిర్వహణ మార్గదర్శకాలు రూపొందించే పేరిట ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తే విద్యాభివృద్ధి కునారిల్లి పోతుంది. ఆ ఫలితాల మేరకు మూడు, నాలుగు సెక్షన్లతో ఉండేటి వందల ప్రభుత్వ పాఠశాలలు నమోదు శాతం పడిపోవటంపట్ల, జీరో నమోదు పాఠశాలలుగా మారుతున్నాయి.ఇందుకు ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యాభారం మోసేందుకు గల విముఖతయే కారణమనాలి. ఒక వైపు విద్యార్థుల నమోదు ఉన్న బడిలోనే మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటుంది . మరొక వైపు మౌలిక సదుపాయాలు,చాలినంత సిబ్బంది ఉన్న బడులకే పిల్లలను పంపే ఉద్దేశంతో తల్లిదండ్రులున్నారు .. ఈ డోలాయమాన పరిస్థితులు కొంత కాలంగా కనిపిస్తున్నాయి. అంతిమంగా ఈ ధోరణులు పాఠశాలల మూసివేతకు దోహదపడుతున్నాయి.
“ఒక వైపు విద్యార్థుల నమోదు ఉన్న బడిలోనే మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటుంది . మరొక వైపు మౌలిక సదుపాయాలు,చాలినంత సిబ్బంది ఉన్న బడులకే పిల్లలను పంపే ఉద్దేశంతో తల్లిదండ్రులున్నారు .. ఈ డోలాయమాన పరిస్థితులు కొంత కాలంగా కనిపిస్తున్నాయి. అంతిమంగా ఈ ధోరణులు పాఠశాలల మూసివేతకు దోహదపడుతున్నాయి.”
తెలంగాణ పై ఉన్న మొత్తం రుణ భారం 2024-25 నాటికి రూ.6,89,021 కోట్లని కాగ్ తేల్చింది. ప్రభుత్వేతర రుణాలకు అత్యధిక గ్యారంటీలు ఇచ్చిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పింది. అత్యధిక అప్పుల భారం పెరిగిన రాష్ట్రాల్లోనూ తొలి స్థానాన్ని ఆక్రమించింది. 2015-16 నుంచి 2024-25 మధ్య పదేళ్లకాల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి కాగ్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్ర అప్పులు ఏటా పెరిగిపోతున్నాయి. పదేళ్లలో నాలుగేళ్లపాటు రెవెన్యూ లోటులో పడిపోయింది. ప్రతి సంవత్సరమూ ఆర్థిక లోటులోనే కొట్టుమిట్టాడుతూంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ ప్రాధాన్యత రంగాలలో విద్యను విస్మరిస్తుంది. విద్యారంగం పై వార్షిక బడ్జెట్ లో కేటాయింపులు ఏమాత్రం సరిపోయేవి కావు.





