– ఇరాన్‌కు రూ.300 మిలియన్ డాలర్ల పరిహారం అంటూ వార్తలు
– అలాంటిదే లేదని ట్రూత్‌లో వెల్లడించిన ట్రంప్
– అణ్వాయుధాలపై ఖచ్చితమైన ఒప్పందం కోసం పట్టు
న్యూయార్క్, జూన్ 16: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇంకా అనుమానాలు తొలగడం లేదు. అయితే అణ్వాయుధాలను కలిగి ఉండబోమని ఇరాన్ అంగీకరించినట్లు సోమవారం డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇక తమ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు 300 మిలియన్ల డాలర్ల ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో ఈ మేరకు స్పందించారు. ఇరాన్‌తో కుదిరే డీల్‌లో.. అణ్వస్త్రాలను డెవలప్ చేయబోమని ఆ దేశం అంగీకరించ నున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇరాన్, అమెరికా మధ్య ఎంవోయూ కుదిరినట్లు వార్తలు వెలుబడుతున్న విషయం తెలిసిందే. జెనీవాలో శుక్రవారం అధికారికంగా రెండు దేశాల మధ్య సంతకాలు జరిగే అవకాశం ఉన్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి రోజు నుంచి స్పష్టంగా ఉన్నారని, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండబోదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. అణ్వాయుధ సేకరణ కోసం ఇరాన్‌కు అనుమతి ఇవ్వబోమని ఇజ్రాయల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ కూడా స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండవద్దు అని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నానని, దీన్ని జీవిత మిషన్‌గా భావించానని అన్నారు. డీల్ కుదిరినా, కుదరకపోయినా, ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్ ఉండబోదన్నారు. ఇజ్రాయెల్ ప్రధానిగా తాను ఉన్నంత కాలం ఇలా జరగబోదన్నారు.అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సంక్షోభానికి తెరపడింది. అయితే, ఈ ఒప్పందం ట్రంప్ యంత్రాంగంలో విభేదాలను బయటపెట్టింది. అణ్వాయుధాలు విడిచిపెట్టాలన్న నిర్ణయానికి ఇరాన్ కట్టుబడి ఉంటుందా అనే విషయంపై కొందరు సీనియర్ అధికారులు అనుమానాలు వ్యక్తంచేసినట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒప్పందం తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో..ఇరాన్ ఉద్దేశాలపై నిఘావర్గాల అంచనాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ ట్రంప్‌తో సహా ఉన్నతాధికారులను హెచ్చరించారు. ఒప్పందం నేపథ్యంలో శుద్ధి చేసిన యురేనియం విషయంలో ఇరాన్ అధికారుల మధ్య చర్చలకు.. వారు మధ్యవర్తులకు చేరవేస్తున్న సమాచారానికి ఎక్కడా పొంతన లేదని తెలుస్తోందన్నారు. అమెరికా డిమాండ్ చేస్తున్నట్లు అణ్వాయుధాలు విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని నిఘా వర్గాలు సూచిస్తున్నాయని తెలిపారు. రాట్‌క్లిఫ్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ లు కూడా అంతర్గత చర్చల్లో ఇదే ఆందోళనను వ్యక్తంచేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌లు మాత్రం ఒప్పందానికి తమ మద్దతు తెలిపారు. కాగా, వైట్‌హౌస్ అధికారి ఒకరు ఈ వార్తలను ఖండించారు. శాంతి ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే ముందు ట్రంప్ భిన్నాభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగిఉండకూడదని, శుద్ధి చేసిన యురేనియంను వారి వద్ద ఉంచుకోకూడదు అన్న కీలక షరతులతో ఈ ఒప్పందం చాలా స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంపై సీఐఏ, విదేశాంగ శాఖ స్పందించేందుకు నిరాకరించాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




