– ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ హత్య కేసులో
న్యూదిల్లీ, జూలై 31 : ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్‌కు దిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 2020 నాటి దిల్లీ అల్లర్లలో అంకిత్ శర్మ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు అత్యంత అరుదైనదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అత్యంత క్రూరంగా ఈ హత్య జరిగిందని వ్యాఖ్యానించింది. హత్య తరువాత కూడా మృతుడిపై ద్వేషం తగ్గలేదని నేరం తీరు చూస్తుంటే అనిపిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మృతదేహాన్ని ఈడ్చుకుంట తీసుకెళ్లి నాలాలో పడేశారని కోర్టు పేర్కొంది. అయితే, మూకదాడిలో భాగంగా ఈ హత్య జరగడం, ఘటన సమయంలో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ శిక్ష ఖరారు చేసినట్టు కోర్టు పేర్కొంది. నాటి అల్లర్లల్లో కొందరు అంకిత్ శర్మపై కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నాలాలో పడేశారు. మరుసటి రోజు ఉదయం మృతదేహం లభించింది. శరీరంపై 54 కత్తి పోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో తాహిర్ కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. కోర్టు తీర్పుపై తాహిర్ లాయర్ స్పందిస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకుంటామని అన్నారు. తనకు న్యాయం కొంత ఆలస్యంగానైనా దక్కుతుందన్న నమ్మకం ఉందని తాహిర్ తెలిపాడు. దిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా కూడా ఈ తీర్పుపై స్పందిస్తూ తాహిర్‌కు యావజ్జీవం ఖరారు కావడంతో న్యాయం దక్కే దిశగా తొలి అడుగు పడిందని అన్నారు. అంకిత్ హత్య జరిగిన తీరు చూస్తే నిందితులకే మరణ శిక్షే తగినదని అభిప్రాయపడ్డారు. తాహిర్‌కు హైకోర్టులో మరణ శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




