– పారదర్శకంగా ఎరువుల పంపిణీ
– ఇంటినుంచే యూరియా బుక్ చేసుకునే వ్యవస్థను తెచ్చాం
– రైతుల సూచనలకనుగుణంగా యాప్‌లో మార్పులు చేస్తున్నాం
– ‘రైతు నేస్తం’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఎరువులను సకాలంలో అందించడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వారికి అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ, టోల్-ఫ్రీ సేవలు, వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు యూరియా పంపిణీని సులభతరం చేయడానికేì, పారదర్శకత కోసమే ఫెర్టిలైజర్ యాప్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు. రైతుల సూచనలకనుగుణంగా యాప్‌లో పలు మార్పులు, మెరుగుదల చేపట్టామని చెప్పారు. యాప్‌ను వినియోగిస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన రైతు తిరుమల గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు వడ్డె ఉమేష్, మంచిర్యాల జిల్లాకు చెందిన రైతులు శ్రీనివాస్, తిప్పని కుమార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు మరియదాస్ తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకున్నారు. ప్రత్యేక అతిథి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. యాప్‌లో కొన్ని సాంకేతిక మార్పులు చేయాలని సూచించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయంటూ ఎక్కడెక్కడ ఎంత యÖరియా నిల్వ ఉందో వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4.06 లక్షల మంది రైతులు యాప్ ద్వారా 13.22 లక్షల బస్తాలు బుక్ చేసుకోగా వాటిలో 11.18 లక్షల బస్తాలు కొనుగోలు అయ్యాయని చెప్పారు. జిల్లాల వారీగా యూరియా కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉందని మంత్రి తెలిపారు. ఈ జిల్లాలో 1,39,121 బస్తాలు, కామారెడ్డి జిల్లాలో 71,742, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 50,638, సంగారెడ్డి జిల్లాలో 34,482, ఆదిలాబాద్ జిల్లాలో 33,485 బస్తాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. డిజిటల్ యాప్ వినియోగంలో ఆదర్శంగా నిలిచిన నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని అభినందించారు. జిల్లాలో సుమారు 3 లక్షల మందికి ఇప్పటికే లక్షన్నర మంది యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని పొందారన్నారు. స్మార్ట్ ఫోన్లు లేని, చదువుకోని లేదా యాప్ వినియోగంపై అవగాహన లేని రైతుల కోసం ప్రభుత్వం టోల్-ఫ్రీ నంబర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశాల నుంచి సముద్ర మార్గంలో వచ్చే యూరియా సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి అవసరమైన కోటాను సాధిస్తున్నామని తెలిపారు. తెలంగాణ అమలు చేస్తున్న ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. పెద్ద రైతులు ఒకేసారి అధిక మొత్తంలో యూరియా కోసం ఆందోళన చెందవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. చిన్న, సన్నకారు రైతులతోపాటు అందరికీ సమానంగా యూరియా అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. అధిక మోతాదులో యూరియా వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటుందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులపై కూడా రైతులను అప్రమత్తం చేశారు. వాతావరణ కేంద్రాల నివేదికల ప్రకారం ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. జూన్, జూలైల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ప్రత్యామ్నాయ పంటల సాగుపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగును తగ్గించి లాభసాటి పంట అయిన ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



