– విచారణను 12వతేదీకి వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, అక్టోబర్ 7 (ఆర్‌ఎన్‌ఎ): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వొచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టకూడదని కేసీఆర్, హరీష్ తమ పిటిషన్లలో వాదించారు. ఆ నివేదికను పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో రూపొందించారని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం చట్టపరంగా సరైంది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా ఆదేశించింది. కమిషన్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి ఈ విచారణ సందర్భంగా కౌంటర్ అఫిడవిట్ సమర్పించకపోవడంపై క్షమాపణలు కోరారు. కొన్ని వివరాలు సేకరించడంలో ఆలస్యం జరిగిందని, త్వరలోనే సమగ్రమైన కౌంటర్ సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆయన వివరణను అంగీకరించి తదుపరి విచారణ తేదీని నిర్ణయించింది. ఇక ఇదే కేసులో మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కమిషన్ నివేదికలో తమ పేర్లు ప్రస్తావించిన నేపథ్యంలో ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోకుండా ఉండాలని కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సీబీఐకి పంపిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు, ఆ నివేదిక ఆధారంగా నేరుగా చర్యలు చేపట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ తన స్వతంత్ర విచారణను చట్టపరమైన విధానాల ప్రకారం కొనసాగించవచ్చని పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





