– మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
– అభిషేక్ సింఘ్వీతో తాజాగా చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాజిక న్యాయం దిశగా చరిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో ఏమాత్రం నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. హైకోర్టులో కేసు బుధవారం విచారణకు రానున్న సందర్భంగా మంత్రులు, న్యాయ నిపుణలుతో చర్చించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం సామాజిక సమతుల్యతకు సంబంధించిన కీలకమైన అంశమని ప్రభుత్వం భావిస్తోంది. కేసు పురోగతిని గంట గంటకు పర్యవేక్షిస్తూ న్యాయపరంగా ఏ మార్పులు వచ్చినా తక్షణమే వ్యూహాన్ని సవరించుకునేలా ప్రత్యేక టీమ్‌ను సీఎం రేవంత్ ఏర్పాటు చేశారు. న్యాయ పోరాటంతోపాటు రాజకీయ, సామాజిక వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు దాకా ప్రతి దశలోనూ బీసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తన పూర్తి శక్తిని వినియోగిస్తోంది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ మను సింఘ్వి, సిద్దార్థ దవేలు వాదనలు వినిపించారు. ఈ విచారణకు ముందే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశాలు ఇవ్వడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కూడిన బృందం దిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించింది. కేసు ప్రాధాన్యత దృష్ట్యా భట్టి విక్రమార్క, మంత్రుల బృందం సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వితో ఫోన్‌లో మాట్లాడారు. బుధవారం హైకోర్టులో జరగనున్నకేసు విచారణలో వాదనలు వినిపించాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఢిల్లీలో సింఘ్విని కలసి ఇదే విషయమై విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





