– నామినేషన్ తిరస్కరణతో మీనాక్షి స్థానంలో మహేశ్ కేవత్
– అనూహ్యంగా కలిసి వచ్చిన అవకాశం
– మీనాక్షిపై కేసు తెలంగాణ నేతలే ఉప్పందించారు
– బీజేపీ మంత్రి కైలాష్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్,జూన్10: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో బీజేపీ విజయానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలో మూడో అభ్యర్థిగా మహేశ్ కేవత్‌కు అవకాశం కల్పించిన బీజేపీ ఏకగ్రీవంగా విజయం సాధించి మూడు రాజ్యసభ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయడం దాదాపు ఖాయమైంది. మరో ఇద్దరు అభ్యర్థులైన తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్‌ల ఎన్నికను ఖరారు చేసేందుకు ఆ పార్టీకి శాసనసభలో తగినంత మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో మహేశ్ కేవత్ రాజకీయ నేపథ్యం ఏమిటో ఓసారి పరిశీలిస్తే బీజేపీలో ఆయనో సీనియర్ నేత. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తోపాటు బీజేపీ సంస్థాగత నెట్‌వర్క్‌తో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం కలిగి ఉన్న కేవత్.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, బీజేపీ యువజన విభాగంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా మంత్రిగానే కాక సంఘ్ పరివార్‌లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. అంతేకాక రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ బోర్డు ఛైర్మన్‌గానూ సేవలందించారు. ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్, కేవత్ సామాజిక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ హిందూ పురాణాలలో పూజ్య పురుషుడైన నిషాద్ రాజ్ వారసత్వ కొనసాగింపునకు ఆయన నామినేషన్ నిదర్శనమని పేర్కొన్నారు. నటరాజన్ నామినేషన్ పత్రాలలో అనేక లోపాలున్నాయని, కొన్ని వివరాలను ఆమె దాచిపెట్టారని బీజేపీ ఆరోపించింది. తెలంగాణలోని ఓ కోర్టులో ఆమెపై ఉన్న పెండింగ్ కేసు విషయాన్ని వెల్లడించలేదనేది ఆ పార్టీ లేవనెత్తిన కీలక అభ్యంతరాలలో ఒకటి. పరిశీలన పక్రియలో ఎన్నికల అధికారులు అభ్యంతరాలను స్వీకరించడంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ పోటీలో కాంగ్రెస్ సవాలుకు దాదాపుగా తెరపడినట్టు సమాచారం. కాగా, మీనాక్షి నటరాజన్ పై నామినేషన్ తిరస్కరణపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనాక్షిపై తెలంగాణలో కేసుల గురించి టీ -కాంగ్రెస్ నేతలే తమకు సమాచారం ఇచ్చారని బాంబు పేల్చారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ’అసలు మీనాక్షీనటరాజన్ పై తెలంగాణలో కేసు నమోదైనట్టు మాకు తెలియనే తెలియదు. అక్కడి కాంగ్రెస్ నేతలే మాకు ఈ సమాచారం ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడి నుంచే మాకు ఈ కేసు పత్రాలొచ్చాయి. దీనిని బట్టి కాంగ్రెస్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి’ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా కైలాష్ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో పెను ప్రకంపనలకు దారితీశాయి. మీనాక్షికి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా కొందరు టీ- కాంగ్రెస్ నేతలు కోవర్ట్ రాజకీయాలు నడుపుతున్నారని ఇప్పటికే కొన్ని వార్తలొచ్చాయి. కైలాష్ వర్గియా వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




