“ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దేశ విద్యార్థులు యువత, మహిళలు, కార్మికులు, రైతులు ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో ఏదో మార్పు జరగబోతోంది అనే భ్రమలు కల్పించడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో గాలివాటం పార్టీలు రాత్రికి రాత్రే పుట్టుకొస్తాయి. పాలక, ప్రతిపక్షాలకు వాటి అవసరం తీరిపోయాక రాత్రికి రాత్రే వాటిని మాయం చేస్తాయి. ప్రశ్నించే గొంతులను నొక్కడం సర్వసాధారణమైంది..”

విద్యార్థులను, నిరుద్యోగ యువతను సీజెఐ గారు బొద్దింకలతో పోల్చారని, అమెరికాలో ఉంటున్న ఎలక్ట్రానిక్ పరికరం వాడే ( ల్యాప్ టాప్ / కంప్యూటర్ ) అభిజిత్ దీప్కే ఆగ్రహం చెందాడు. వెను వెంటనే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అని నామకరణం చేసి సోషల్ మీడియా ద్వారా బహుళ ప్రచారం కల్పించాడు. అంతే ఇంకేముంది ప్రధానంగా భారత్ లో ఉంటున్న వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్, ఎక్స్ ….. వాడే యువత జాతరలా కదిలింది. ఆవేశంతో కూడిన, తీవ్ర అసంతృప్తితో ఉన్న కొత్త యువతరం ఇవ్వాళ దీనిని బహుళ ప్రాచుర్యం లోకి తెచ్చింది. స్పష్టమైన విధాన రూపకల్పన లేకుండా కేవలం ఉత్సాహంతో, తీవ్ర నిరుత్సాహంలో ఉన్న యువతతో మొదలైన పార్టీ ఇది. దీని కార్యాచరణ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీల పాలనా విధానాలకంటే భిన్నంగా ఎలా ఉండబోతుంది? మనుగడ ఎలా అన్న చర్చ తీవ్రంగానే జరుగుతుంది.
కుటుంబ బాధ్యత, పెరుగుతున్న శాస్త్ర శాంకేతికతపై అవగాహన లేని తరమిది. ఊహల్లో విహరించే, స్వేచ్చా ప్రపంచాన్ని కాంక్షించే తరమిది. మీడియా ప్రచారంతో, ఏదో జరుతుందనే/ జరగబోతుందనే ఉహా ప్రపంచంలో విహరిస్తున్న తరమన్నమాట. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితరాలను లాప్టాప్, సెల్ ఫోన్, ట్యాబ్ తదితర ఎలక్ట్రానిక్ యంత్రాలనుప్రచార సాధనాలుగా వాడుతూ సోషల్ మీడియాలో బహుళ ప్రచారం సాగిస్తున్న యువతరం. అన్యాయం, అవినీతి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం, అస్తిత్వ పార్టీలు అంటూ విమర్శల వ్యంగ్యాస్త్రాల చిట్ చాట్లు చేస్తూ కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న లోకం. ప్రత్యామ్నాయ నినాదహోరు. ఆ హోరులో కొట్టుకుపోతున్న కొత్తతరం. చరిత్ర తెలియదు. సమస్యల పరిష్కార మార్గాలు చూపరు. విధ్వంసం అవుతున్న మానవీయ విలువలపైన చర్చ ఉండదు. పర్యావరణ స్పృహ శూన్యం. పీడిత ప్రజల బ్రతుకులు ఛిద్రం చేస్తున్న కార్పొరేట్ శక్తుల ఊసెత్తరు. దేశ ప్రజలకు చెందిన వనరులను దోచిపెడుతున్న రాజకీయ పార్టీల వైఖరిని ఎలా అడ్డుకుంటారో చెప్పరు. అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి మాయాజాలంలో యువత జోగుతూ ఉండేలా ఉపన్యాసాలు / పోస్టింగులు. భవిష్యత్ పై అంచనాలులేని పాతాళ భైరవిలాంటి పరిష్కార రూపాన్ని చూపుతారు. ఆచరణ లేని ఆకాశ దీపాలు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాష్ట్ర సేన వంటి పార్టీలు రాజకీయాల్లో ఎక్స్ ట్రా ఆర్టిస్టులు మాత్రమే. వీటికి ఒక సిద్ధాంతం లేదు. యాంటీ గవర్నమెంట్ వోటు బ్యాంకును సొంతం చేసుకోడానికి లేదా ప్రతిపక్షాల వోటు బ్యాంకును చీల్చడానికి అధికార పార్టీలు చేసే ప్రయత్నంలో పాచికలు మాత్రమే. వీటి వెనుక కార్పొరేట్ సంస్థలు, వాటి మీడియా, ఆర్ఎస్ఎస్ కూడా ఉండి ఉండవచ్చు. నిజానికి ఇవన్నీ ప్రజా జీవితాలను మరింత గందరగోళ పరిచి సంక్షోభంలోకి నెట్టివేసే కుట్రలో భాగస్వాములే.
ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటుకు ముందు దిల్లీ కేంద్రంగా అన్నా హజారే, క్రేజీవాల్, కిరణ్ బేడీ, పతంజలి వంటి వారి ఆధ్వర్యంలో ‘లోక్ పాల్ బిల్లు’ పేరుతో (నకిలీ) కార్పొరేట్ మీడియా ఉత్తుత్తి ఉద్యమం చేశారు. దానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీడియా ప్రచారం చేసింది. తర్వాత రాజకీయాలను బాగు చేయాలనే పేరుతో క్రేజీవాల్ ‘ఆప్’ అనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి దిల్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆ దెబ్బకు దిల్లీలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అప్పటివరకు గొప్పగా కనిపించిన అన్నాహజారే ఎక్కడ దాక్కున్నాడో.!? ఈ దేశ ప్రజలకు తెలియదు. అతని గొంతు ఎందుకు మూగ పోయిందో తెలియదు. అన్నాహజారే ను ముందు పెట్టి నకిలీ ఉద్యమ డ్రామా నడిపిన, నకిలీ/ దొంగ దేశభక్తులు తమ పది సంవత్సరాల పరిపాలనలో లోక్ పాల్ బిల్లు విషయం ఎందుకు మాట్లాడలేదు. దానికి ఒక్కటే కారణం సామ, దాన, భేద, దండోపాయాలతో దేశ రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలనే కుట్రతో రాజకీయ ఆలోచనలు చేయడమే. నేడు దేశంలో 87% యువత నిరుద్యోగ సమస్యతో పోరాడుతున్నారు. అడుగడుగున అవినీతి, లంచగొండితనం స్వైర విహారం చేస్తుంది. చిన్న, సన్నకారు రైతులు, చిరు వ్యాపారులు విదేశీ దిగుమతులు, సుంకాలు, జీఎస్టీ వంటి వాటితో విసిగిపోయారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, భూమాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా అంతా బడా కాంట్రాక్టర్స్ చేతుల్లో రాజకీయ చదరంగపు ఆటలో పావులుగా మార్చబడ్డాయి. ప్రతి ఎన్నికల్లో డబ్బు, మద్యం, పలు ప్రజాకర్షణీయమైన హామీలు బహుమతుల ప్రలోభాలు పెట్టుబడిగా దేశంలో కార్పొరేట్ (ప్రజల పేరుతో) ప్రజాస్వామ్యం కొనసాగుతుంది. దానికి తోడు ఫాసిస్ట్ లక్షణాలు మతోన్మాదం, నకిలీ/ గుడ్డి దేశభక్తి జతకూడి దేశ చట్ట సభలలో అధికార పీఠంలో కొనసాగుతున్నాయి.
సంస్కరణవాదుల వెంట, వారిని ప్రమోట్ చేయడంలో కలిగే ఆనందమే వేరు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఎజెండాతో పనిచేయడం, పరిష్కారం కోసం నిలబడి పోరాటాలు చేయడం చాలా కష్టం కదా! అత్యంత తేలికగా , ఎలాంటి త్యాగం అవసరం లేకుండా, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మతవిద్వేషాలు వంటి సమస్యల పరిష్కారానికి తేలికైన మార్గాన్ని ఎవరు ఇష్టపడరు. ఎఫ్బీ అకౌంట్, వాట్సప్, ట్విట్టర్, ఎక్స్ ….. లలో ఖాతాలో తెలిస్తే చాలు ప్రశాంతంగా కూర్చునే ప్రజల మౌలిక సమస్యలు అన్ని చిటికెలో పరిష్కరించు కోవచ్చు. ఆహా! ఎంత మంచి కల. వావ్, లేవకండి,కల చెదిరిపోవచ్చు. ఏది ఏమైనా, దేశంలో నానాటికి యువతలో, నిరుద్యోగులలో పెరుగుతున్న నైరాష్యాన్ని మనుగడలో ఉన్న రాజకీయ పార్టీలపై, వాటి పాలనా విధానాలపై పెరుగుతున్న అసహనానికి దీనిని ప్రతీకగా అర్థం చేసుకోవచ్చు. ఆవేశంలో పుట్టుకొచ్చే ఇలాంటి వాటికి నిర్మాణాత్మక రూపం, నిర్దిష్ట రాజకీయ తాత్విక చింతన లేకపోతే దీర్ఘకాలం మనుగడ సాగించలేవు
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దేశ విద్యార్థులు యువత, మహిళలు, కార్మికులు, రైతులు ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో ఏదో మార్పు జరగబోతోంది అనే భ్రమలు కల్పించడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో గాలివాటం పార్టీలు రాత్రికి రాత్రే పుట్టుకొస్తాయి. పాలక, ప్రతిపక్షాలకు వాటి అవసరం తీరిపోయాక రాత్రికి రాత్రే వాటిని మాయం చేస్తాయి. ప్రశ్నించే గొంతులను నొక్కడం సర్వసాధారణమైంది. ఇంతటి సంక్షోభ కాలంలో విప్లవ, వామపక్ష పార్టీలు, ప్రజాస్వామిక ఆకాంక్షలు కలిగిన సంఘాలు, బుద్ధి జీవులు, యువత సాధ్యమైనంత వరకు ప్రజల హక్కుల రక్షణకై ముందడుగు వేయాలి. విద్యార్థులు, మహిళలు, శ్రామికులు, పెటీ బూర్జవా మేధావులు ప్రత్యామ్నాయ రాజకీయాల నిర్మాణానికి నడుం బిగించాలి. భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం, బాధ్యత ఉన్నది, అదే క్రమంలో సిద్ధాంత, రాద్దాంతాలను ప్రక్కన పెట్టి ఐక్య కార్యాచరణ, ప్రణాళికతో పాలకుల పనితీరు, స్వభావంపై ఉమ్మడిగా ప్రచారం, ఆందోళన కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలి. పీడిత ప్రజలను విముక్తి చెయ్యడానికి, సమస్యల సుడిగుండం నుండి బయట పడెయ్యాలంటే ప్రజా ఉద్యమాలే శరణ్యం. ఇది అక్షర సత్యం. చారిత్రకంగా రుజువైన వాస్తవం.
-రమణాచారి





