– ఆ పార్టీ కుట్రలో పావుగా మారిన పవన్
– ఇష్టం వచ్చినట్లు తెలంగాణపై మాట్లాడితే ఊరుకోం
-పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: పవన్ కళ్యాణ్ పదేపదే తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని టి-పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాజకీయాల్లో విచ్చలవిడిగా మాట్లాడటానికి ఇది సినిమా కాదని హితవు పలికారు. ఈమేరకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంపై, కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ స్వతహాగా మాట్లాడడం లేదన్నారు. కేంద్రంలోని మోదీ, ఇతర బీజేపీ నేతలు కించపరిచేలా స్క్రిప్ట్ ఇస్తే, దాని ప్రకారం పవన్ మాట్లాడుతున్నారు. ఆయన పూర్తిగా బీజేపీ ఆడించే తోలుబొమ్మలా మారిపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ ఆవిర్భావాన్ని, రాష్ట్ర విభజనను పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ మాట్లాడటం కొత్త కాదని, గతంలోనూ మోడీ సహా బీజేపీ నేతలు ఇదే తరహాలో తెలంగాణను అవమానించారని గుర్తుచేశారు. ఎంతోమంది యువకులు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్టాన్న్రి సాకారం చేశారని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ఉద్యమం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఏ సినిమాలో నటిస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడమంటే సినిమాల్లో డైలాగులు చెప్పినంత సులువు కాదని, నెహ్రూ, గాంధీ కుటుంబాల త్యాగాల చరిత్రను పవన్ చదువుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రధాని మోడీ ఇవాళ రాకెట్ల ముందు నిలబడి ఫోటోలు దిగుతున్నారంటే ఆ అంతరిక్ష రంగానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ చాలా పెద్ద హీరో కావడానికి తెలంగాణ ప్రజలు కూడా కారణమని, ఇక్కడి ప్రేక్షకులు చూడబట్టే ఆయన సినిమాలు ఆడాయనే విషయాన్ని మరువరాదని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌కు అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు, ఆ విషయంలో ఆయన చాలా చిన్నవాడు. అధికారం ఉందని తెలంగాణ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం‘ అని హెచ్చరించారు. రెండు రాష్టాల్రు విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామని, కానీ తెలంగాణలో రాజకీయ లబ్ది కోసం ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని మహేష్ గౌడ్ అన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పాలన సాగుతోందని, ఏపీ సైతం మన వైపు చూసేలా ఇక్కడ పరిపాలన ఉందన్నారు. అయితే, తెలంగాణను కించపరుస్తూ పవన్ కళ్యాణ్ ఇంతలా మాట్లాడుతున్నా బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీరి మౌనం వెనుక బీజేపీ, బీఆర్‌ఎస్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం స్పష్టంగా అర్థమవుతోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.