సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు మార్గం సుగమం!

– ప్రాజెక్టు ఎన్‌వోసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ
– ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ కె¡లక భేటీ
– సానుకూలంగా స్పందించిన విష్ణుదేవ్
– ముంపు భూములకు చట్టబద్ధ పరిహారం చెల్లింపునకు సిద్ధం
– మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : గోదావరి నదిపై తలపెట్టిన సమ్మక్క-సారక్క బ్యారేజ్/సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతుల సాధనలో మరో కీలక ముందడుగు పడినట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గురువారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతించారు. అనంతరం నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారుల బృందంతో కలిసి ఆయనతో మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తలపెట్టిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తుది పరిశీలనకు తీసుకెళ్లేందుకు అవసరమైన అభ్యంతర రహిత పత్రం(ఎన్‌వోసీ) జారీ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ వినతి పత్రాన్ని సమర్పించారు. సమ్మక్క-సారక్క బ్యారేజ్ రాష్ట్ర రైతాంగానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని వివరించారు. విష్ణుదేవ్ సాయి మన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని, సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ పరిణామం ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియలో కీలక మలుపుగా నిలుస్తుందన్నారు. కేంద్ర జల సంఘంలోని అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ మినహా మిగతా అన్ని ప్రధాన డైరెక్టరేట్ల నుంచి ప్రాజెక్టుకు ఇప్పటికే అనుమతులు లభించాయని మంత్రి వెల్లడించారు. ఎన్‌వోసీ లేనందునే డీపీఆర్ తుది పరిశీలన నిలిచిపోయిన విషయాన్ని విష్ణుదేవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు ఇప్పటికే సంయుక్త సర్వే నిర్వహించారని, మరింత ఖచ్చితమైన సర్వే కోసం ఛత్తీస్‌గఢ్ కోరగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని చెప్పారు. సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లను 2026 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావిత భూములు గుర్తించిన పక్షంలో చట్టబద్ధంగా పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే పరిహార మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2009 ఫిబ్రవరి 10న జారీ చేసిన జీవో నెం.27 ద్వారా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి లభించిందని, 2012 మార్చి 2న కేంద్ర జల సంఘం డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటిపారుదల రంగ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టును పునఃరూపకల్పన చేశారని మంత్రి తెలిపారు. సాంకేతిక అధ్యయనాల అనంతరం బ్యారేజ్‌ను ములుగు జిల్లాలోని తూపాకులగూడెం వద్ద నిర్మించడం సాంకేతికంగా, ఆర్థికంగా మరింత ప్రయోజనకరమని తేలిందన్నారు. ఈ మార్పుతో ఛత్తీస్‌గఢ్‌లో ముంపు ప్రభావం గణనీయంగా తగ్గిందని వివరించారు.

ఆయకట్టు స్థిరీకర‌ణ‌

ఈ బ్యారేజ్ ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించి ఎస్సారెస్పీ స్టేజ్-2 కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు, అదనంగా రామప్ప-పాకాల లింక్ కాలువ ద్వారా మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో 2,34,199 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 96,494 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 85,774 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 22,422 ఎకరాలు, జనగామ జిల్లాలో 1,111 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. రామప్ప-పాకాల లింక్ ద్వారా ములుగు జిల్లాలో 8వేల ఎకరాలు, వరంగల్ నర్సంపేట ప్రాంతంలో 22వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉందన్నారు. ఇదేకాక జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలోని కొంత ఆయకట్టు స్థిరీకరణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. పాజెక్టు డీపీఆర్‌ను 2021 ఆగస్టు 31న కేంద్ర జల సంఘానికి సమర్పించగా హైడ్రాలజీ డైరెక్టరేట్, కాస్ట్ ఎస్టిమేట్స్ డైరెక్టరేట్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర భూగర్భ జల మండలి సహా పలు ప్రధాన అనుమతులు ఇప్పటికే లభించాయని చెప్పారు. 2024 జూలై నుంచి 2026 జనవరి వరకు కేంద్ర జల సంఘం కోరిన వివరణలన్నింటికీ తెలంగాణ నీటిపారుదల శాఖ సమగ్ర సమాధానాలు సమర్పించిందన్నారు. ఎన్‌వోసీ సాధన కోసం ప్రభుత్వం రెండేళ్లుగా నిరంతరంగా కృషి చేస్తోందన్నారు. 2025 సెప్టెంబర్ 22న రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. అంతేగాక కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్, కేంద్ర జల సంఘం చైర్మన్‌తో కూడా చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు. 2025 నవంబర్, డిసెంబర్‌లల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రత్యేక విజ్ఞప్తులు పంపి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు వివరించారు. ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతుండటం, తెలంగాణ ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేయడం, ముంపు ప్రభావితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ముందుకు రావడం, రెండు రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనడం వల్ల త్వరలోనే ఎన్‌వోసీ లభించే అవకాశాలు మెరుగయ్యాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎనఓసీ జారీ చేసిన వెంటనే కేంద్ర జల సంఘం అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ డీపీఆర్ తుది పరిశీలన పూర్తి చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు, సాగునీటి భద్రత, తాగునీటి అవసరాలు, అంతర్‌రాష్ట్ర సత్సంబంధాలు.. ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *