– లాజిస్టిక్స్ పాలసీ 2.0 ద్వారా మౌలిక వసతుల వృద్ధికి పెద్దపీట
– ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో హెచఐసీసీ నోవాటెల్‌లో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎగుమతుల సన్నద్ధత సూచీలో దేశవ్యాప్తంగా తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచిందన్నారు. అదే సముద్ర తీరం లేని రాష్ట్రాల(ల్యాండ్‌లాక్డ్) జాబితాలో రెండో స్థానంలో ఉందన్నారు. మర్చంటైజ్ ఎగుమతుల్లో దేశంలోనే ఏడో స్థానంలో నిలవడం తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ లక్ష్యసాధనలో ‘లాజిస్టిక్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడాన్ని ఒక పరిమితి(లిమిటేషన్)గా కాక ఒక డిజైన్ అడ్వాంటేజ్‌గా మార్చుకుంటున్నామన్నారు. లాజిస్టిక్స్ పాలసీ 2.0 ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్‌హౌసింగ్, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నామన్నారు. లాజిస్టిక్ రంగానికి అవసరమైన రెడీ టు స్కిల్డ్ వర్క్‌ఫోర్స్ తయారీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను లాజిస్టిక్ రంగంలోనూ సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్, రైల్ లింక్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ కార్గో, కోల్డ్ చైన్, గ్రేడ్-ఎ వేర్‌హౌసింగ్, ఆటోమేషన్, డిజిటల్ లాజిస్టిక్ ప్లాట్ ఫామ్స్, గ్రీన్ మొబిలిటీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ ఆర్.రవికుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేకే మహేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గరిమెళ్ల, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కమిటీ చైర్మన్ కమల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



