https://www.prajatantranews.com/party-to-strong-at-booth-level/పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: బూత్‌స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి సమర్ధవంతంగా తీసుకెళ్ళగలుగుతామని, బూత్, గ్రామ, మండలస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. రాష్ట్రంలో కాంగెస్ర్ పార్టీ 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్‌గా అభివర్ణించారు. పార్టీ నిర్మాణంపైన పీసీసీ దృష్టి సారించాలని, కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేలా పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని కోరారు. పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేయాల్సిందేనన్నారు. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం., పని చేస్తేనే పదవులు వస్తాయని రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. తాను గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు వంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాల్సి ఉందని సూచించారు.