హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: ‘ఈనాడు’ వరంగల్ రిపోర్టర్, సీనియర్ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి శనివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఈయన మృతిపట్ల పలువురు రాష్ట్ర మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. సమాజం కోసం నిరంతరం తపించే ఒక మంచి జర్నలిస్టుని కోల్పోవడం బాధాకరమని, ఆయన హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవల కాళేశ్వరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరస్వతి పుష్కరాలు విజయవంతం కావడంలో ఆయన సహకారం మరువలేనిదని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని శ్రీధర్‌బాబు తెలిపారు. దత్తురెడ్డి మృతిపట్ల నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఈనాడు స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేసిన కాలంలో అనేక పరిశోధనాత్మక కధనాలు అందించారని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని అన్నారు. రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దత్తురెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. దత్తురెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి
నిఖార్సైన తెలంగాణ యువ జర్నలిస్టు, ఈనాడు సీనియర్ రిపోర్టర్ దత్తురెడ్డి మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గొప్ప భవిష్యత్తు ఉన్న దత్తురెడ్డి చిన్న వయస్సులోనే అకాల మరణం చెందడం బాధాకరమంటూ సంతాపం ప్రకటించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జీడిపల్లి ఆకస్మిక మరణం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. 37 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణానికి గురికావడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్ధించారు. హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ స్టాఫ్ రిపోర్టర్‌గా అనేక కథనాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టినపుడు అనేక పరిశీలనాత్మక, అవగాహనా కథనాలు రాశారన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న దత్తురెడ్డి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవటం విషాదకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.