పీఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, రైతన్నలకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా, పెట్టుబడి సాయం కింద రైతు భరోసా, సన్నాలు సాగు చేసిన రైతులకు రూ.500 బోనస్, రైతు బీమా, పంట నష్టం జరిగితే పరిహారం, భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతన్నల కోసం దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పీసీసీ పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సీజన్లో పంటలకు పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. రూ.8,675 కోట్లు జమ చేశామని చెప్పారు. అన్నదాతల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్తు పథకం కింద నెలకు .900 కోట్ల చొప్పున అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రూ.17,091 వేల కోట్లు రైతుల పక్షాన ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించిందన్నారు. ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్రంలోని 29.40 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, సన్న ధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ రూపంలో ఈరోజు వరకు రూ.1,199 కోట్లు రైతులకు ప్రజా ప్రభుత్వం చెల్లించిందని, రైతన్నకు ఊహించని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు రైతు బీమా పథకాన్ని అమలు అమలు చేస్తున్నామని, ఈ పథకం కింద 42.16 లక్షల మంది రైతులకు బీమా అందించామని వివరించారు. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నేటివరకు రూ.50 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.
ఇందిరా గిరి వికాసం
ఈ పథకం కింద 2.1 లక్షల గిరిజన రైతులకు సోలార్ విద్యుత్ పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్, ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు, పామాయిల్ వంటి మొక్కలను అందిస్తున్నామని మంత్రి భట్టి తెలిపారు. ఇందుకుగాను 12,600 కోట్లు కేటాయించామన్నారు. పూర్తిగా రైతన్నల కోసం చేపట్టిన కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నామని, మొదటి సంవత్సరం 58 పాఠశాలలు నిర్మించేందుకు రూ.11,600 కోట్లు కేటాయించామని వివరించారు. మన పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లోని 7.66 లక్షల మంది విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డైట్ చార్జీలు 40శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచామన్నారు.
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
కోటిమంది మహిళలను ఐదు సంవత్సరాలలో కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు అందజేస్తున్నామని, మొదటి సంవత్సరం లక్ష్యాన్ని మించి రూ.21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు తెలిపారు. ఇప్పటికే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని భట్టి చెప్పారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పేరిట రూ.9వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలోని 3.10 కోట్ల మంది పేదలకు ఉగాది నుంచి సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ఇందుకుగాను ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.13,525 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, దీని మూలంగా 90 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ఇప్పుడు ఉన్న చికిత్సలకు అదనంగా మరో 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని సాగునీటి పెండిరగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేస్తామని, ఇందుకుగాను తాజా బడ్జెట్‌లో రూ.23,373 కోట్లు కేటాయించామని వివరించారు. రాబోయే మూడేళ్లలో 17 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను 28 వేల కోట్లు తో అభివృద్ధి చేయనున్నాం. చేయూత పథకం కింద మన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటివరకు రూ.17,563 వేల కోట్ల ఖర్చు చేయగా 43.01 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందారని ఉప ముఖ్యమంత్రి భట్టి వివరించారు.