ముదిరాజులు విశ్వసనీయమైన వారు

– ప్రభుత్వంలో వారిని భాగస్వాములను చేసే బాధ్యత నాది
– కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజులే
– పండగ సాయన్న జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : ముదిరాజ్‌లు విశ్వసనీయమైన వారని, ప్రభుత్వంలో వారిని భాగస్వాములను చేసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాను పీసీసీ అధ్యక్షుడిని కాగానే శ్రీహరి ముదిరాజ్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించానని, శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేశానని, నీలం మధుకు ఎంపీ టికెట్ ఇచ్చానని వివరించారు. ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచిస్తున్నానన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువారం జరిగిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సభలో ఆయన ప్రసంగించారు. సాయన్న జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. నిజాం హయాంలో దొరలు పేదల భూమి ఆక్రమిస్తుంటే పేదలకు అండగా పండగ సాయన్న నిలిచాడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దొరలకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేసినవాడు పండుగ సాయన్న అన్నారు. తన పోరాటం ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచాడన్నారు. సాయన్న ప్రజలకు ధాన్యం పంచడమే కాదు.. పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం చేసిన ఘనత ఆయనదేనని చెప్పారు. సాయన్నను నిజాం పోలీసులు అరెస్టు చేస్తే నాటి వనపర్తి మహారాణి పెద్ద ఎత్తున నిధులు చెల్లించి సాయన్నను విడిపించారని చెప్పారు. సాయన్నను అన్యాయంగా హత్య చేశారంటూ ఆయన చనిపోయి వందేళ్లు దాటినా నేటికీ నాట్లు, కోతల సమయంలో పండుగ సాయన్న పాటలు వినిపిస్తున్నాయని గుర్తు చేశారు. కాగా, బ్రిటిష్ హయాంలో కుల గణన చేశారని, వందేళ్ల తర్వాత తమ ప్రభుత్వం కుల గణన చేపట్టిందని తెలిపారు. కుల గణన చేసినందునే ఈ రోజు బలంగా ప్రతి కులం తమ గళం వినిపిస్తోందంటూ ఎవరైనా కుల గణనలో తమ జనాభా తక్కువగా ఉందని భావిస్తే పూర్తి వివరాలు ఇస్తే లెక్కలు సవరిస్తామని హామీ ఇచ్చారు. లెక్కలు లేనందునే ముదిరాజ్‌లను బీసీ ‘డి’ నుంచి ‘ఏ’కు మార్చలేకపోయారని, ఈ అంశంపై వచ్చే కేబినెట్‌లో చర్చిస్తామని అన్నారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయిస్తామని, ఈ అంశంపై ఇతర కులాలకు ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉందని అన్నారు. జఠిలమైన ఎస్సీ వర్గీకరణను అమలు చేశామన్నారు. పండగ సాయన్న ముదిరాజ్ జయంతి సభలో సాయన్నపై పాటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

సంక్షేమ పథకాలను రెట్టింపు అమలు చేస్తున్నాం

నాడు ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తే తాము 3.48 కోట్ల మందికి నేడు సన్న బియ్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వాలు చేసిన సంక్షేమానికి రెట్టింపు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం.. తెలంగాణ వచ్చాక రాష్ట్ర గీతం అధికారికంగా ప్రకటించుకున్నామని, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ అమలు చేసిన మంచి పథకాలు అమలు చేస్తూనే రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్నల చరిత్రను కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్‌పై సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలను ఆవిష్కరిస్తామన్నారు. సాయన్న, గద్దర్, అందెశ్రీ వంటి వారు జీవితమంతా సమాజం కోసమే జీవించారని తెలిపారు. బహుజనుల జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం అని, ఆ ఎన్నికల్లో రాహుల్‌కి అండగా నిలవాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *